హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్ మణికొండ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం చోటుచేసుకుంది. సింగూరు నుంచి నగరానికి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్ ఒక్కసారిగా పగిలిపోవడంతో కాలనీల్లోకి భారీగా నీరు చేరి వరద పరిస్థితులు నెలకొన్నాయి. తెల్లవారుజామున భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బయటకు వచ్చి చూసే సరికి ప్రధాన నీటి సరఫరా పైప్‌లైన్ పేలిపోయి నీరు ఎగసిపడుతూ రోడ్లపై వరదలా ప్రవహిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
తీవ్ర ఇబ్బందులు..
పైప్‌లైన్ పేలిన ప్రభావం తీవ్రంగా ఉండటంతో సమీపంలోని అపార్ట్‌మెంట్ల సెల్లార్లు పూర్తిగా నీటితో నిండిపోయాయి. సెల్లార్లలో పార్క్ చేసి ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొంతమంది తమ వాహనాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నించినా నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో సాధ్యపడలేదు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ముఖ్యంగా National Disaster Response Force (ఎన్‌డీఆర్‌ఎఫ్) బృందాలు రంగంలోకి దిగి సెల్లార్లలో నిండిన నీటిని భారీ మోటార్ల సహాయంతో బయటకు పంపే పనిలో నిమగ్నమయ్యాయి. గత రెండు గంటలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ట్రాఫిక్‌కి అంతరాయం…
ఈ ఘటనతో రోడ్లు దెబ్బతిని రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి ఉధృతి కారణంగా కొంతమేర రోడ్డు భాగం దెబ్బతినడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితి అదుపులోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రమాదం తెలిసిన వెంటనే నగరానికి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు. నీటిపారుదల శాఖ అధికారులు పైప్‌లైన్ పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. పైప్‌లైన్ పగిలిన కారణాలపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే మరమ్మతులు పూర్తి చేసి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో మణికొండ ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.