మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు.. 7 ఏళ్ల తర్వాత తీర్పు, కరాటే కోచ్‌కు 20 ఏళ్ల జైలు

హైదరాబాద్‌లో 2019లో నమోదైన ఓ చిన్నారి లైంగిక దాడి కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన కరాటే కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, స్కూల్ ప్రిన్సిపాల్‌కు కూడా శిక్ష ఖరారు చేసింది.

మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు: కరాటే కోచ్‌కు 20 ఏళ్ల జైలు, ప్రిన్సిపాల్‌కూ శిక్ష
మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు: కరాటే కోచ్‌కు 20 ఏళ్ల జైలు, ప్రిన్సిపాల్‌కూ శిక్ష
  • ప్రైవేట్ స్కూల్ కరాటే కోచ్, స్కూల్ ప్రిన్సిపాల్
  • పోక్సో కేసులో కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించింది
  • మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి, సైబరాబాద్

హైదరాబాద్‌లో 2019లో నమోదైన ఓ చిన్నారి లైంగిక దాడి కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా, తాజాగా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడైన కరాటే కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా, కేసులో మరో నిందితురాలైన ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్‌కు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష ఖరారైంది.

సైబరాబాద్ పోలీసుల ప్రకటన ప్రకారం, 2019 జూన్‌లో మూడున్నరేళ్ల బాలిక తండ్రి మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్లడానికి బాలిక నిరాకరించడంతో పాటు అసాధారణ ప్రవర్తన చూపించడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా, పాఠశాలలోని ఓ పురుష శిక్షకుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తెలిపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ప్రధాన నిందితుడితో పాటు స్కూల్ ప్రిన్సిపాల్‌ను 2019 జూలైలో అరెస్టు చేశారు. అనంతరం సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.

పూర్తిస్థాయి విచారణ అనంతరం రాజేంద్రనగర్‌లోని పోక్సో ప్రత్యేక కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. మరో నిందితురాలికి మూడేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించింది.

అలాగే బాధిత చిన్నారికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

ఈ కేసు తీర్పు పిల్లలపై జరిగే లైంగిక నేరాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తోందని పోలీసులు పేర్కొన్నారు.

Also read: హైదరాబాద్ డెంటల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది సీనియర్ విద్యార్థులపై కేసు, 6 నెలల సస్పెన్షన్

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »