హైదరాబాద్, జూన్ 17: దేశీయ పరిశోధన రంగాన్ని వాణిజ్య మార్కెట్‌తో అనుసంధానిస్తూ, సరికొత్త ఆవిష్కరణలకు పీఠం వేసేలా తెలంగాణ వేదికగా ఒక అద్భుత ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ‘యాక్సిస్ బ్యాంక్’, దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన ‘బిట్స్ పిలానీ’ (BITS Pilani) చేతులు కలిపాయి. హైదరాబాద్ క్యాంపస్‌లో రూ.100 కోట్ల భారీ సీఎస్‌ఆర్ (CSR) నిధులతో ‘యాక్సిస్ బ్యాంక్–బిట్స్ ఇండస్ట్రీ రీసెర్చ్, టెక్నాలజీ & ఇన్నోవేషన్ పార్క్’ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఇరు సంస్థలు ప్రకటించాయి. ఈ మేరకు ముంబైలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఇరు సంస్థల ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం (MoU) పై సంతకాలు చేశారు.
జీనోమ్ వ్యాలీ కారిడార్‌లో వైద్య ఆవిష్కరణల హబ్
హైదరాబాద్‌లోని సుప్రసిద్ధ లైఫ్ సైన్సెస్ కారిడార్ అయిన ‘జీనోమ్ వ్యాలీ’ పరిసరాల్లో ఈ రీసెర్చ్ పార్క్ ఏర్పాటు కానుంది. ఇది ప్రధానంగా బయోఫార్మా, హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ , మెడికల్ డివైసెస్ (వైద్య పరికరాలు) రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉండేలా, అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన వైద్య సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు.
1.20 లక్షల చదరపు అడుగుల్లో అత్యాధునిక వసతులు
ఈ ప్రాజెక్టు మార్గదర్శకత్వ బాధ్యతలను బిట్స్ పిలానీ పర్యవేక్షించనుండగా, మౌలిక వసతుల కల్పనకు యాక్సిస్ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది. దాదాపు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబోయే ఈ అత్యాధునిక… పార్కులో హై-టెక్ లాబొరేటరీలు, ఇంక్యుబేషన్ సెంటర్లు కొలువుదీరనున్నాయి. ఇది అకడమిక్ ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు , ఎంఎస్ఎమ్‌ఈ (MSME) లకు మేధో సంపత్తి (IP) హక్కుల నిర్వహణ, సాంకేతిక బదిలీ (Technology Transfer) లో అండగా నిలుస్తుంది.
‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధన దిశగా..
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయాలకు అనుగుణంగా ఈ కేంద్రం స్వయం సమృద్ధిని పెంపొందించనుంది. ల్యాబ్‌లో పుట్టే ఆలోచనలను విజయవంతంగా మార్కెట్లోకి తీసుకురావడానికి (Lab-to-Market Pipeline) ఈ డీప్-టెక్ రీసెర్చ్ పార్క్ దేశంలోనే ఒక మోడల్ లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని ఇరు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.
