హైదరాబాద్‌లో 40 గంటల నీటి సరఫరా నిలిపివేత .. పలు ప్రాంతాల్లో తీవ్ర అంతరాయం .. ఇబ్బంది ప‌డ‌నున్న న‌గ‌ర‌వాసులు

మంజీరా ఫేజ్–2 ప్రధాన పైపులైన్‌కు అత్యవసర మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 11 ఉదయం నుంచి 12 రాత్రి వరకు దాదాపు 40 గంటల పాటు హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని జలమండలి సూచించింది.

Hyderabad water supply shutdown due to Manjira Phase-2 pipeline leakage

వేసవి సీజన్ పూర్తిగా మొదలుకాకముందే తెలంగాణ ప్రజలకు తాగునీటి కష్టాలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరానికి ప్రధాన తాగునీటి వనరుల్లో ఒకటైన మంజీరా ఫేజ్–2 పైపులైన్‌లో భారీ లీకేజీలు గుర్తించడంతో, అత్యవసర మరమ్మతులు చేపట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) నిర్ణయించింది. ఈ కారణంగా బుధవారం ఉదయం నుంచి గురువారం రాత్రి వరకు దాదాపు రెండు రోజుల పాటు నీటి సరఫరా పూర్తిగా నిలిపివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

లీకేజీలతో నీటి వృథా

నగరానికి తాగునీటిని సరఫరా చేసే 1500 ఎంఎం భారీ డయా పంపింగ్ మెయిన్ పైపులైన్‌లో పలుచోట్ల లీకేజీలు ఉన్నట్లు సాంకేతిక బృందాలు గుర్తించాయి. ముఖ్యంగా పటాన్‌చెరు – హైదర్‌నగర్, కలబుగూర్ – పటాన్‌చెరు మధ్య ఉన్న పైపులైన్లలో నీరు భారీగా వృథా అవుతోందని అధికారులు వెల్లడించారు. ఈ లీకేజీల కారణంగా నీటి ఒత్తిడి తగ్గిపోవడంతో చివరి ప్రాంతాలకు సరైన సరఫరా అందడం లేదని తెలిపారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.

Also Read: కామారెడ్డి విద్యార్థుల ఇస్రో యాత్ర: శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు సర్కార్ ప్రోత్సాహం!

40 గంటల సరఫరా బంద్

అధికారుల ప్రకారం ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 12 రాత్రి 10 గంటల వరకు సుమారు 40 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోతుంది. పైపులైన్లలో వెల్డింగ్, సాంకేతిక మరమ్మతుల పనుల కోసం పంపింగ్ పూర్తిగా ఆపివేయాల్సి ఉంటుందని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత గురువారం అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా పునఃప్రారంభం అవుతుందని చెప్పారు.

ఈ మరమ్మతుల ప్రభావం నగరంలోని పలు కీలక ప్రాంతాలపై పడనుంది. డివిజన్–17: రామచంద్రాపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, డివిజన్–22: బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, డివిజన్–6: ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, డివిజన్–9: కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, ప్రగతి నగర్ .. ఈ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోతుందని జలమండలి స్పష్టం చేసింది.

నీటి అంతరాయం దృష్ట్యా ప్రజలు ముందస్తుగా తాగునీటిని నిల్వ చేసుకోవాలని, అవసరానికి తగ్గట్టు వినియోగించాలని అధికారులు సూచించారు. మరమ్మతుల పనులు పూర్తయ్యే వరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వేసవి కాలానికి ముందు ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చర్యలు అవసరమని జలమండలి వెల్లడించింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »