ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.5,500 కోట్ల భూమికి రక్షణ

రూ.5,500 కోట్ల విలువైన 35 ఎకరాలకుపైగా ఎఫ్‌టీఎల్ భూమిని రక్షిస్తూ ముష్కిన్ చెరువు వద్ద భారీ ఆపరేషన్ చేపట్టిన హైడ్రా.

Muskin Lake HYDRAA Encroachment Removal
ముష్కిన్ చెరువుపై హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.5,500 కోట్ల భూమికి రక్షణ
  • పుప్పలగూడ-నార్సింగ్ పరిధిలోని ముష్కిన్ చెరువులో హైడ్రా ఆపరేషన్
  • 35.10 ఎకరాల ఎఫ్‌టీఎల్ భూమిని కబ్జా ప్రయత్నాల నుంచి రక్షణ
  • రక్షించిన భూమి విలువ రూ.5,500 కోట్లకు పైగా ఉంటుందని అంచనా

ముష్కిన్ చెరువుపై హైడ్రా భారీ ఆపరేషన్.. రూ.5,500 కోట్ల భూమికి రక్షణ

HYDRAA మరోసారి చెరువుల పరిరక్షణలో కీలక చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పలగూడ-నార్సింగ్ గ్రామాల పరిధిలోని ముష్కిన్ చెరువులో జరిగిన భారీ కబ్జా ప్రయత్నాలను అడ్డుకుంటూ శనివారం ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది. చెరువు పూర్తి ట్యాంక్ లెవల్ (FTL) పరిధిలో ఉన్న ఆక్రమణలను తొలగించి, సంబంధిత శాఖల సమక్షంలో సరిహద్దులను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది.

హైడ్రా అంచనా ప్రకారం ఈ చర్యలతో రూ.5,500 కోట్లకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమి రక్షితమైంది. ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో భూముల విలువ భారీగా ఉండటంతో చెరువు భూములపై ఒత్తిడి పెరిగినట్లు అధికారులు గుర్తించారు.

అభివృద్ధి పేరుతో కబ్జా ప్రయత్నాలు

ముష్కిన్ చెరువు మధ్యలో కట్ట నిర్మించి, ఎగువ భాగంలో ఉన్న 35.10 ఎకరాల ఎఫ్‌టీఎల్ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని హైడ్రా గుర్తించింది. చెరువు అభివృద్ధి పేరుతో భూమి స్వరూపాన్ని మార్చి నిర్మాణాలకు సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు.

గ్రామ రికార్డుల ప్రకారం చెరువు మొత్తం విస్తీర్ణం 59.11 ఎకరాలు కాగా, హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరిధి 52.20 ఎకరాలుగా నిర్ధారించారు. ఇందులో ప్రభుత్వానికి చెందిన 20.23 ఎకరాల శిఖం భూమి కూడా ఉంది.
Also Read : ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు వద్దు – హైడ్రా 10 రోజుల గడువు

ప్రజావాణి ఫిర్యాదుతో వెలుగులోకి

స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చెరువును మట్టితో నింపుతున్నారని, చెత్తను సేకరించి అక్కడే వేరు చేసి వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చెరువు కలుషితమవడంతో పాటు పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఫిర్యాదుల ఆధారంగా రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి హైడ్రా క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించింది. అనంతరం భారీ ఆపరేషన్ చేపట్టి ఆక్రమణలను తొలగించింది.

పేదల పేరుతో భూముల ఆక్రమణ?

పేదల పేరుతో గుడిసెలు నిర్మించి భూములను ఆక్రమించేందుకు రియల్టర్లు ప్రయత్నిస్తున్నారని హైడ్రా అధికారులు తెలిపారు. అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు ముందుగానే అవగాహన కల్పించి, ఖాళీ చేయడానికి రెండు నెలల సమయం ఇచ్చారు. పరిస్థితిని అర్థం చేసుకున్న చాలామంది స్వచ్ఛందంగా ఖాళీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

40 నుంచి 50 గుడిసెలతో పాటు చెత్త వేరు చేసే షెడ్లను కూడా తొలగించారు. అనంతరం హైడ్రా బృందాలు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ పనులు చేపట్టాయి.

స్థానికుల హర్షం

చెరువును కాపాడటానికి హైడ్రా తీసుకున్న చర్యలను స్థానికులు స్వాగతించారు. సంవత్సరాలుగా వివిధ శాఖలకు వినతిపత్రాలు ఇవ్వడం, సంతకాల సేకరణ, ఉద్యమాలు చేసిన తర్వాత తమ డిమాండ్ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు.

ఐటీ కారిడార్ సమీపంలో వేలాది కుటుంబాలకు ఊపిరితిత్తుల్లాంటి ఈ చెరువును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, చెరువులో పోసిన మట్టిని తొలగించాలని ఇప్పుడు స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read : హైదరాబాద్‌లో చెరువు ఆక్రమణలపై హైకోర్టు సీరియస్

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »