హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ ఆపరేషన్లు నిర్వహించింది. ఒకే రోజులో ఏకంగా 840 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. ఈ భూముల విలువ రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులతో కలిసి హైడ్రా ఈ ఆపరేషన్లు చేపట్టింది. తప్పుడు పత్రాలు, సర్వే నంబర్లతో వందల ఎకరాలు కాజేయాలని చూసిన వారి ఆటలు కట్టించింది.
ఎక్కడెక్కడ ఎంత భూమి?
- శంషాబాద్ మండలం బహదూర్‌గూడ: సర్వే నంబర్లు 25, 26లలో 650 ఎకరాలు
- శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం: సర్వే నంబరు 46లో 84 ఎకరాలు
- సికింద్రాబాద్ కంటోన్మెంట్: జీఎల్ఆర్ నంబర్లు 243, 255లలో 106 ఎకరాలు
ఈ మూడు చోట్లా భూముల చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పించింది.
అరెకరం కొని.. ఎకరం కాజేసి!
రాయదుర్గం ఐటీ కారిడార్‌లో టీ-హబ్‌కు కూతవేటు దూరంలో, మల్కం చెరువు ఎదురుగా కొండలు, గుట్టలు, పచ్చని చెట్లతో సహజసిద్ధంగా ఉన్న ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కన్ను పడింది.
హైడ్రా ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదులు: ‘లేఅవుట్లను మాయం చేస్తున్నారు.. మా పార్కులు, రోడ్లను కాపాడండి!’
HYDRAA Hyderabad: పేట్బషీరాబాద్లో హైడ్రా యాక్షన్.. రూ. 100 కోట్ల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్!
HYDRAA Prajavaani: హైడ్రా ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదులు.. కబ్జాదారులపై కమిషనర్ ఏవీ రంగనాథ్ సీరియస్!
ఈ భూమికి ఆనుకుని ఉన్న అర ఎకరం ప్రైవేటు పట్టా భూమిని ఓ సంస్థకు యజమాని అమ్మారు. ఆ వెంటనే పక్కనున్న ప్రభుత్వ భూమిని కూడా తక్కువ ధరకు అమ్మేలా ఒప్పందం కుదుర్చుకుని.. సర్వే నంబరు 46లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి ఎకరం వరకూ కాజేశారు. రిజిస్ట్రేషన్ కూడా జరిగిపోవడం గమనార్హం.
ఇక్కడ ఎకరం విలువ రూ.200 కోట్ల వరకూ పలుకుతుంది. గుట్టల మాటున గుట్టుగా సాగుతున్న ఈ కబ్జా పర్వానికి రెవెన్యూ, హైడ్రా అధికారులు అడ్డుకట్ట వేసి 84 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
కొండలు పేల్చి.. నెమళ్లను తరిమి
కంటోన్మెంట్ పరిధిలోని 106 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాదారులు వాటాలేసుకుని కాజేసే ప్రయత్నం చేశారు. వేరే సర్వే నంబర్లతో భూమిలోకి ఎంటరై ఏకంగా లేఅవుట్లే వేసేశారు.
చిట్టడవిని తలపించే ఈ పచ్చని గుట్టల్లో సహజసిద్ధమైన కొండలను పేల్చడంతో నెమళ్లు భయంతో నివాస ప్రాంతాల్లోకి ఎగిరిపోయే పరిస్థితి ఏర్పడింది. వన్యప్రాణుల మనుగడకు భంగం కలిగిస్తున్న ఈ ఘటనలపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
స్పందించిన హైడ్రా.. నిర్మాణ సంస్థలు ప్లాట్ల విక్రయానికి వేసిన లేఅవుట్లను, ప్రికాస్ట్ ఇటుకలతో నిర్మించిన ప్రహరీలను తొలగించి 106 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేసింది.
టపాసులతో స్థానికుల సంబరాలు
కంటోన్మెంట్ భూముల పరిరక్షణపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. హైడ్రాకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీలు తీసి, టపాసులు పేల్చి ‘హైడ్రా జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. ప్రజల ఫిర్యాదుతో మొదలై ప్రజల సంబరాలతో ముగిసిన ఆపరేషన్‌గా ఇది నిలిచింది.
శంషాబాద్ భూముల వెనుక రియల్ దందా
శంషాబాద్ విమానాశ్రయ రన్‌వేకు దక్షిణాన, ఓఆర్ఆర్‌కు ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. రైతుల వద్ద లక్షల్లో కొని, కోట్ల విలువైన భూమిని కాజేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. చాలామంది రైతులు ఇప్పటికే అమ్ముకుని వెళ్లిపోయారు.
అయితే 1954 ఖాస్రా పహాణీ ప్రకారం సర్వే నంబర్లు 25, 26లోని 650 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. 2002-2006 మధ్య నిర్వహించిన ‘ఎంజాయ్‌మెంట్ సర్వే’ ఆధారంగా క్రమబద్ధీకరణ ప్రతిపాదన ప్రభుత్వానికి వెళ్లినా.. అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో భూ కేటాయింపుపై నిషేధం ఉందంటూ 2006లో సీసీఎల్ఏ తిరస్కరించింది. దీంతో క్రమబద్ధీకరణ అంశం ముగిసిన అధ్యాయంగా రికార్డులకెక్కింది.
ప్రస్తుతం ఈ భూముల్లో ఫామ్ హౌస్‌లు కట్టుకుని వ్యవసాయం చేస్తున్న వారిని ఖాళీ చేయించి, భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా స్వాధీనం చేసుకుంది.