మూసీ దండి మార్చ్‌లో ధ్వజమెత్తిన కేటీఆర్.. “ఇండ్లు కూల్చడం కాదు.. హామీలు నెరవేర్చాలి”

మూసీ ప్రక్షాళన పేరుతో వేలాది పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. షా కోట్‌లో నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’

KTR

మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేతలపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. సుందరీకరణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే ప్రజల ఇళ్లను కూల్చివేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని షా కోట్ ప్రాంతంలో మూసీ బాధితులు చేపట్టిన ‘మూసీ దండి మార్చ్’ పాదయాత్రలో కేటీఆర్ పాల్గొని బాధితులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో మూసీ నది అభివృద్ధి చేస్తామంటూ వేలాది పేద, మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారని ఆరోపించారు.

“హామీలు నెరవేర్చండి”

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇండ్లు కూల్చడం మానుకొని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేటీఆర్ సూచించారు. ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని, గ్రామీణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

హైడ్రా పేరుతో కూడా ఇళ్ల కూల్చివేతలు జరిగాయని, చిన్న పిల్లలు గల్ల బుడ్డి ఇచ్చి రేవంత్ రెడ్డికి ఇవ్వమని చెబుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిలా అక్రమ సంపాదనతో కట్టుకున్న ఫ్యాలెస్‌లు ప్రజలకు లేవని, హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి అప్పగించామని, ఇప్పుడు నగరాన్ని పాతాళానికి తీసుకెళ్తున్నారని ఆరోపించారు.

Also Read: వెస్ట్ హైదరాబాద్‌లో 6-లేన్ రోడ్డుకు ఆమోదం గండిపేటకు ఊతం

పేదలకు ఇళ్లు ఉండకూడదా?..

ముఖ్యమంత్రి విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారని, కోట కంచెకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కేటీఆర్ అన్నారు. ఉప ముఖ్యమంత్రికి మూడు ఇళ్లు, ముఖ్యమంత్రికి రెండు ఇళ్లు ఉండవచ్చని, కానీ పేదలకు మాత్రం ఇళ్లు ఉండకూడదా? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్లు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ సవాల్ విసిరారు. డీపీఆర్ లేకుండా ఇళ్లను ఎలా కూలుస్తారని ప్రశ్నిస్తూ, రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో బుల్డోజర్ రాజ్యం అంటుంటే తెలంగాణలో జరుగుతున్నది ఏమిటని నిలదీశారు.

రెండేళ్లలో మార్పు తీసుకొస్తాం

కొంతమంది కాంగ్రెస్ నేతల ఇళ్లు బఫర్ జోన్‌లో ఉన్నాయని, కానీ సాధారణ ప్రజల ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. “రెండేళ్లు మీ భూములు, ఇళ్లను కాపాడుకోండి. రెండేళ్లలో మేము అధికారంలోకి వస్తాం. మీ ఇంటికి సున్నం కూడా పోకుండా చూస్తాం,” అని హామీ ఇచ్చారు.

ఈ దుర్మార్గ పాలన నుంచి తెలంగాణను కాపాడుకోవాలని పిలుపునిస్తూ, అవసరమైతే ప్రతి ఒక్కరూ ప్రజల కోసం బయటకు రావాలని కేటీఆర్ కోరారు. మూసీ ప్రక్షాళన వివాదం రాజకీయంగా మరింత ముదురే సూచనలు కనిపిస్తున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »