హైదరాబాద్: తెలంగాణలోని చారిత్రక సంపదను ప్రపంచ పర్యాటకులకు పరిచయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు బుధవారం కార్వాన్ ఎమ్మెల్యే శ్రీ కౌసర్ మొహియుద్దీన్‌తో కలిసి కుతుబ్ షాహీ టూంబ్స్, కటోరా హౌస్ మరియు ఖజానా బిల్డింగ్ (KB) మ్యూజియంలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వారంలోగా పనులు ప్రారంభించాలి:
కుతుబ్ షాహీ టూంబ్స్‌లోని ఇంటర్ప్రిటేషన్ సెంటర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించిన మంత్రి, వక్ఫ్ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న అంశాలను పక్కన పెట్టి, మిగిలిన అభివృద్ధి పనులను వారంలోగా ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పర్యాటక ఆకర్షణగా రోప్‌వే & షాపింగ్ కాంప్లెక్స్:
నగర పర్యాటకానికి కొత్త ఊపునిచ్చేలా మంత్రి పలు కీలక ప్రతిపాదనలు చేశారు:
గోల్కొండ రోప్‌వే: కుతుబ్ షాహీ టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్‌వే నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ (DPR) సిద్ధం చేయాలని పర్యాటక శాఖను ఆదేశించారు. ఇందుకోసం పురావస్తు శాఖ, GHMC, HMDA మరియు QQSDA విభాగాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు.
లాడ్ బజార్ తరహా కాంప్లెక్స్: గోల్కొండ బస్ స్టాప్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో పాతబస్తీలోని లాడ్ బజార్ తరహాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి నేషనల్ మాన్యుమెంట్ మిషన్ అథారిటీ నుంచి అనుమతులు పొందాలని అధికారులకు సూచించారు.
ఖజానా బిల్డింగ్ మ్యూజియం అభివృద్ధి:
- చారిత్రక కళాఖండాలకు నిలయమైన ఖజానా బిల్డింగ్ మ్యూజియంను పర్యాటకంగా అభివృద్ధి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు.
- ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా చేనేత వస్త్రాల (ఖాదీ) ప్రదర్శనను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
- మ్యూజియం వెనుక భాగంలో ఉన్న ఆక్రమణలను పోలీస్ శాఖ సహకారంతో వారం రోజుల్లోగా తొలగించాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
కటోరా హౌస్ ప్రక్షాళన:
కటోరా హౌస్‌ను పర్యాటక కేంద్రంగా మార్చాలని సూచిస్తూనే, అక్కడి పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను మంత్రి ఆదేశించారు.
ప్రపంచ స్థాయికి తెలంగాణ పర్యాటకం:
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రకృతి రమణీయతతో పాటు అద్భుతమైన వారసత్వ సంపద ఉందని, పర్యాటకులను ఆకర్షించేందుకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీటీడీసీ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున రావు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read: