అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్: ముఖీం అక్రమ కట్టడాలు నేలమట్టం!

సంగారెడ్డి జిల్లా ఐలాపూర్‌లో రూ. 15 వేల కోట్ల విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ముఖీం సోదరుల అక్రమ నిర్మాణాల కూల్చివేత. పూర్తి వివరాలు.

HYDRAA demolitions Ameenpur
HYDRAA demolitions Ameenpur

అమీన్‌పూర్ (సంగారెడ్డి): దశాబ్దాలుగా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కబ్జాదారులపై హైడ్రా (HYDRAA) యుద్ధం ప్రకటించింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో శనివారం (ఏప్రిల్ 11, 2026) నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో సుమారు 861 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ. 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

షోకాజ్ నోటీసులు.. బేఖాతరు: అజీం అక్రమ నిర్మాణం

ముఖీం సోదరుడు ఎం.ఏ. అజీం, దుబాయ్‌లో ఉంటూ తన అనుచరుల ద్వారా ఐలాపూర్ ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా 6 అంతస్తుల భారీ భవనాన్ని నిర్మించారు.

నోటీసులు: ఈ భవనానికి అనుమతులు లేవని 2025 జూన్ 25న హైడ్రా షోకాజ్ నోటీసు ఇచ్చింది.

నిర్లక్ష్యం: 2025 జూలై 3న ‘స్పీకింగ్ ఆర్డర్’ జారీ చేసి, 15 రోజుల్లోగా నిర్మాణాన్ని తొలగించాలని ఆదేశించినా అజీం పట్టించుకోలేదు. పైగా హైడ్రా చర్యల నుంచి తప్పించుకోవడానికి భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేశాడు.

ఫ్లాట్లు అమ్ముడుపోక ‘అద్దె’ డ్రామాలు!

హైడ్రా నోటీసుల నేపథ్యంలో ఆ భవనంలోని 45 ఫ్లాట్లను కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో భవనాన్ని కాపాడుకోవడానికి అజీం కొత్త డ్రామాకు తెరలేపాడు. నివాసాల జోలికి హైడ్రా రాదనే సాకుతో తన అనుచరులను, మరికొందరు అమాయకులను తీసుకువచ్చి 20 ఫ్లాట్లలో అద్దెకు దించాడు. అయితే, హైడ్రా ముందే అప్రమత్తమై, అద్దెకు ఉన్నవారిని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చింది. శనివారం కూల్చివేతకు ముందు DRF సిబ్బంది సహకారంతో నివాసితుల సామాన్లను సురక్షితంగా బయటకు తరలించిన తర్వాతే భవనాన్ని నేలమట్టం చేశారు.

హైకోర్టు స్టే ఉన్నా ఆగని కబ్జాలు!

1998 మరియు 2013లో ఐలాపూర్ గ్రామంలోని 1 నుండి 220 సర్వే నంబర్ల వరకు ఉన్న భూమి స్వరూపం మార్చకూడదని హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ, ముఖీం తన అక్రమాలను సాగించాడు. 40 ఎకరాల్లో భారీ ఫామ్ హౌస్, గెస్ట్ హౌస్ నిర్మించడమే కాకుండా, వేలాది ప్లాట్లను విక్రయించి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నాడు.

గ్రామస్థుల సంబరాలు – సోషల్ మీడియా తప్పుడు ప్రచారం  

ముఖీం ఆగడాల నుంచి విముక్తి లభించడంతో ఐలాపూర్ తండా మరియు గ్రామస్థులు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అయితే, ఈ కూల్చివేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని హైడ్రా ఖండించింది. నిరుపేదల ఇళ్లకు ఎలాంటి నష్టం కలిగించలేదని, కేవలం అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.

Also Read: 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »