నగరంలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు, ఐటీ ఉద్యోగులు నిత్యం ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా మార్చేందుకు బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్ నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే పిల్లర్ల నిర్మాణం దాదాపు పూర్తి దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: ఫార్ములా ఈ–కారు కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం… కేటీఆర్‌ను ఏ1గా పేర్కొనే అవకాశం
శాశ్వతంగా తగ్గించడమే లక్ష్యం..
ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్లలో ప్రతిరోజూ ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా తగ్గించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. సుమారు రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ నిర్మాణంలో ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి డీఎల్‌ఎఫ్ ప్రాంతం వరకు నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అలాగే పాత ముంబై హైవే నుంచి డీఎల్‌ఎఫ్ వైపు రెండు లేన్ల వన్‌వే ఫ్లైఓవర్ ఏర్పాటు చేయనున్నారు. ఇందిరానగర్ నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వరకు అండర్‌పాస్ నిర్మాణం కూడా ప్రాజెక్ట్‌లో భాగంగా కొనసాగుతోంది.
ఐటీ కారిడార్‌లో ఉదయం, సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లతో ఉద్యోగులు గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో చేపట్టిన ఈ సిగ్నల్ ఫ్రీ కారిడార్ ప్రాజెక్ట్ పూర్తయితే వాహనదారులు ఒక్క సిగ్నల్ వద్ద కూడా ఆగకుండా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఇంధన వినియోగం కూడా గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.
2028 మే నాటికి లక్ష్యంగా..
ఈ భారీ ప్రాజెక్ట్‌ను 2028 మే నాటికి పూర్తి చేయాలని జీహెచ్‌ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత కోకాపేట నియోపొలిస్ ప్రాంతానికి రవాణా మరింత సులభతరం అవుతుందని భావిస్తున్నారు. అలాగే పాత ముంబై హైవేపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణం సాఫీగా మారనుందని వాహనదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా నగర ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్యకు ఇది దీర్ఘకాలిక పరిష్కారంగా నిలుస్తుందని నగరాభివృద్ధి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.