సీతాఫలం అంటే ఇష్టపడని వారు అంటూ వుండరు. ఈ సీజనల్ పంట కోసం ఏడాదంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సీతాఫలం ఎక్కువగా కాయలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పాలమూరు జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అయ్యేది.
ఈ ఫలానికి ఎన్నో పేర్లున్నాయి. సుగర్ ఆపిల్, స్వీట్ సాప్, సీతాఫలం లాంటి పేర్లతో పిలుస్తారు. చలికాలంలో దొరికే పండు కాబట్టి సీతాఫలం అనే పేరు ప్రధానంగా ఉంది. ఈ సీతాఫలంలో పోషకాలు మెండుగా ఉంటాయి. రసాయనాలు లేకుండా కేవలం సహజమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ పండు లభిస్తుంది.
సీతాఫలం హైపోథైరాయిడ్, చిగుళ్ల వాపు, కాళ్ల నొప్పులు, కాల్షియం లోపాన్ని నివారించడానికి ఎంతో తోడ్పడుతుంది. బరువు పెరగడానికి, గర్భిణీ స్త్రీలకు సీతాఫలం ఉపయోగపడుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు ఈ సీతాఫలాలు ఉపాధిని కూడా అందించేవి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిపడా కురవక, సీతాఫలాలు కాయలేదు.
వెండర్:
అడవిలో పోతే ఇంత చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఒకటి కూడా సరిగ్గా దొరకదు. పొద్దు నుంచి తిరిగితే ఓ గంప కూడా సరిగ్గా దొరకడం లేదు. ఇంత కష్టపడి చేస్తే బేరం కూడా పెడతారు .
వర్షాలు లేక చెట్లు కూడా కాయలేవు. ఇక పంట మొత్తం ఎండిపోయింది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో విస్తారంగా ఉన్న అడవిలో సీతాఫలాలు విరివిగా కాస్తుంటాయి. గుట్టలు, వ్యవసాయ పొలాల్లో సీతాఫలాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి. సరైన వర్షాలు లేక సీతాఫలాలు కనిపించడం లేదు. ఉమ్మడి జిల్లాలోని షాద్‌నగర్, కల్వకుర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, కొల్లాపూర్, అచ్చంపేట, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో ఈ సీతాఫలాలు అధికంగా లభిస్తాయి. చుట్టూ ఉండే అడవులు, వ్యవసాయ పొలాల్లో సీతాఫలాలు లభిస్తాయి. వాటిని సేకరించి వివిధ ప్రాంతాల్లో మార్కెట్‌కు తరలిస్తారు. పాలమూరు జిల్లాలో లభించే సీతాఫలాలు ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. కానీ ఉత్పత్తి తగ్గి ఫలం జాడ లేకుండా పోయింది.
వెండర్:
పోయిన ఏడాది మస్త కాయలు వుండే . రెండు వందలకు, మూడు వందల పైన ఓ గంప వేసి పోతుంటిమి. ఈసారి కాయలు లేవు . చెట్టుకి రెండు కాయలు కూడా లేవు. రేట్‌లు కూడా రెండు వందలు, మూడు వందల కన్నా తక్కువ అడుగుతుండ్రు. పెద్ద కాయకు రేట్ పెట్టట్లేరు, చిన్న కాయకు రేట్ పెట్టట్లేరు. పెద్ద కాయకి అదే రేట్ పెడుతున్నారు, చిన్న కాయకు అదే రేట్ పెడుతున్నారు.
వెండర్:
ఈసారి వానలు లేవు, కాయలు లేవు. ఎట్లా బతకాలో అర్థమైతలేదు. అన్నిటికీ మస్తు ఇబ్బంది ఉంది . రెండు వందలు, మూడు వందలు అంటుండ్రు. పొద్దు సన్నం వాడికి తిరిగినా మా కూలి కూడా వెళ్తలేదు. ఈసారి కాయలు లేక మస్తు ఇబ్బంది పడుతున్నాం మేమైతే.
సీజన్‌లో హైదరాబాద్–శ్రీశైలం హైవే, హైదరాబాద్–బెంగళూరు హైవేపై స్టాల్స్‌తో సందడి కనిపించేది. ప్రతిరోజు వందల సంఖ్యలో ట్రేలు, బుట్టల్లో సీతాఫలాలు అమ్ముడైపోయేవి. వ్యాపారం దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగేది. ఈ నాలుగు నెలలు సీతాఫలం వ్యాపారం చేసుకుని జీవనం సాగించే చిరు వ్యాపారులు మంచి లాభాలు చూసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
వెండర్:
కాయలకు పోతున్నాం కానీ కాయలు లేవు. పూత పడే సమయంలో బాగా ఎండలు వచ్చి పూత రాలిపోయింది. ఒక చెట్టుకు నాలుగు, ఐదు , పది కాయలు ఎక్కువ లేవు. అవి కూడా ఓడిపోయినట్టే ఉండేది. పోయినసారి బానే ఐదు వందలు, ఆరు వందలు, ఎనిమిది వందలు దాకా పోయింది.
తిరిగి తిరిగి ఒక్క గంప కూడా దొరకయి. ఇద్దరు కలిసి పొద్దు అంత తిరిగితే ఒక గంప దొరుకుతాయి . ఆటో కిరాయి ముప్పై ఐదు రూపాయలు కిరాయి ఒక గంపకు.
సీతాఫలాలు తినడానికే కాదు.. గుజ్జుతో ఎన్నో రకాల ఆహార పదార్థాలు, ఐస్‌క్రీమ్ తయారీకి, మిల్క్‌షేక్‌లకు, జ్యూస్‌లకు ఉపయోగిస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సీతాఫల్ తోటలను సాగు చేస్తున్న రైతులకు, కూలీలకు, వ్యాపారులకు పూర్తి స్థాయిలో ఎల్‌నినో నష్టాలను కొని తెచ్చిపెట్టింది.