ఆధునిక భారతదేశ సామాజిక, దైనందిన జీవితంలో భాగమైన మూడు చారిత్రక గోద్రెజ్ ఉత్పత్తుల నేపథ్యాన్ని విశ్లేషించే ఆబ్జెక్ట్స్ అండ్ ఆఫ్టర్‌లైవ్స్ పుస్తకాన్ని గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్కైవ్స్ ఆవిష్కరించింది. ప్రముఖ చరిత్రకారిణి డాక్టర్ లక్ష్మీ సుబ్రమణ్యన్ రచించిన ఈ గ్రంథాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. ముంబైలోని నెహ్రూ సెంటర్ వేదికగా నవంబర్ 24న ఈ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
మూడు ఐకానిక్ ఉత్పత్తుల వెనుక దాగిన కథనాలు..
భారతీయుల జీవనశైలిలో విడదీయరాని భాగంగా మారిన స్టోర్‌వెల్ బీరువా, ఆఫీస్ కుర్చీ, రిఫ్రిజిరేటర్ల వెనుక ఉన్న ఆసక్తికర కథలను, వాటి చారిత్రక ప్రాధాన్యతను రచయిత్రి ఈ పుస్తకంలో సవివరంగా చర్చించారు. 2018 నుండి 2020 మధ్య కాలంలో గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ ఆర్కైవ్స్‌లో స్కాలర్-ఇన్-రెసిడెన్స్‌గా పనిచేసిన సమయంలో చేసిన పరిశోధనల ఆధారంగా ఆమె ఈ రచనను పూర్తి చేశారు.
ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ వేడుక..
గోద్రెజ్ ఆర్కైవ్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డాక్టర్ ఫెరోజా జె గోద్రెజ్ సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు పలువురు విద్యావేత్తలు, చరిత్రకారులు, రచయితలతో పాటు సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.