విజయదశమి సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. రెండు యుగాల్లోనే జమ్మి చెట్టుకు సంబంధించిన విశేషాలు ఉన్నాయి. “శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశిని.. అర్జునస్య ధనుర్ధారి.. రామస్య ప్రియదర్శిని” అని జమ్మిని పూజిస్తాం. మన పాపాలన్నీ పోగొట్టే శక్తి శమీ వృక్షానికి ఉందని చెబుతారు.
శమీ వృక్షం అగ్ని తత్వాత్మకమైనది.
రాముడికి సీతాదేవి ఎక్కడుందో చూపించినది కూడా జమ్మి చెట్టే అని చెబుతారు. అందుకే “రామస్య ప్రియదర్శిని” అంటారు. అలాగే “అర్జునస్య ధనుర్ధారి” అని అంటారు. ద్వాపర యుగంలో అర్జునుడు తన ధనుస్సును ధరించాడు. అర్జునుడి ధనుస్సును ఎవరూ మోయలేరు. అది కూడా అగ్ని దేవుడి ద్వారా లభించినది కాబట్టి, అగ్ని తత్వం కలిగిన జమ్మి చెట్టు మాత్రమే దాన్ని ధరించగలిగిందని చెబుతారు.
పాండవులు తమ అరణ్యవాసం పూర్తయిన తరువాత అజ్ఞాతవాసానికి వెళ్లబోతూ, తమను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు తమ ఆయుధాలను ఒక చెట్టు మీద పెట్టారు. ఆ చెట్టు జమ్మి చెట్టు. అందుకే “అర్జునస్య ధనుర్ధారి” అంటారు. రాముడి ప్రియురాలైన సీతాదేవి జాడను తెలిపినందుకు “రామస్య ప్రియదర్శిని” అని, పాపాలను పోగొట్టి శత్రువులను నాశనం చేసేటటువంటి శక్తి కలిగినందుకు “శమీ శమయతే పాపం.. శమీ శత్రు వినాశిని” అని జమ్మి చెట్టును పూజిస్తారు.
ద్వాపర యుగం చివర జరిగిన ఈ ఘట్టానికి సంకేతంగానే విజయదశమి రోజున ఊరి చివర ఉన్న జమ్మి చెట్టు దగ్గరికి వెళ్లి జమ్మి కొట్టి తీసుకొస్తూ ఉంటారు. విజయదశమి అంటే చెడుపై మంచి విజయం సాధించిన కాలం. ఎక్కడెక్కడ ఏ రూపాల్లో చెడు ఉందో ఆ చెడునంతటినీ పోగొట్టి, అన్ని చోట్ల మంచిని కలిగించే శక్తి ఈ రోజు చెడును జయించి విజయాన్ని సాధించి సింహాసనం మీద కూర్చొని విరాజమానమై ఉన్న రాజరాజేశ్వరి దేవి. అటువంటి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ, లోకంలో చెడు అన్నది లేకుండా అందరూ మంచిగా ఉండేటట్లు చూడమని ప్రార్థిద్దాం. అదే విజయదశమి శుభాకాంక్షలు.
రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం
మరి రాజరాజేశ్వరి అమ్మవారి అవతారం ఎలా వచ్చింది? రాజులకు రాజు రాజు, రాజులకు ఈశ్వరి రాజరాజేశ్వరి. చిన్న రాజ్యం ఉంటే రాజు అంటారు. పది మంది రాజుల మీద పెద్ద అధికారం ఉన్నవారిని రాజేశ్వరుడు లేక మహారాజు అంటారు. అట్లాంటి వాళ్లు బ్రహ్మాండంలో ఎంతమంది ఉంటే అంతమందిపైనా ఆధిపత్యం కలిగిన అమ్మవారు రాజరాజేశ్వరి.
రాజ శబ్దానికి “ప్రకాశించు” అని అర్థం కూడా ఉంది. చక్కగా ప్రకాశించి, వెలుగులకు ప్రకాశంగా ఉన్నటువంటి తల్లి ఆ రాజరాజేశ్వరి దేవి. అంబారౌద్రిణి, భద్రకాళి, భగళా, జ్వాలాముఖి, వైష్ణవి, బ్రహ్మాణి, త్రిపురాంతకి, సురనుతా, దేదీప్యమానోజ్వల, చాముండా, ఆశ్రితరక్ష పోషక జనని, దాక్షాయణి, చిద్రూప పరదేవతా భగవతి శ్రీ రాజరాజేశ్వరి.
చిద్రూపం కలిగినటువంటి భగవతి ఆ రాజరాజేశ్వరి. ఆవిడకు మనం చక్కగా నమస్కారం చేసుకుంటే లోకాన్ని అంతటినీ చక్కగా పరిపాలిస్తుంది. ప్రతి సందర్భంలోనూ, యుగయుగాలలో రాక్షసులు బాగా విజృంభించిన సందర్భంలో అమ్మవారు అవతరించి రాక్షస సంహారం చేసింది. ఈ అవతరణ ఎప్పుడూ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు జరిగి, తొమ్మిది రోజుల యుద్ధం తరువాత నవమి నాడు రాక్షస సంహారం పూర్తవుతుంది.
అందుకే దశమి నాడు హడావిడి లేకుండా సింహాసనం మీద ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది.
వాగ్దేవతలు అందరూ ఆవిడ చుట్టూ చేరి కీర్తిస్తూ ఉంటారు. దేవతలు, ఋషులు, మునులు మొదలైన వారందరూ సభ తీర్చి ఆవిడను గొప్పగా కీర్తిస్తారు. “అమ్మా.. నీవల్ల కదా మేము ఈ రకంగా చక్కగా, హాయిగా ఉండగలిగాం. రాక్షస బాధ పోయింది. సుఖంగా ఉన్నాం” అని ఆవిడకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు.
అలా కృతజ్ఞతలు తెలుపుకునే సందర్భంలో అమ్మవారు కొలువు తీర్చి ఉన్నది సింహాసనం మీద. అందుకే అటువంటి ఆవిడను రాజరాజేశ్వరి పరభట్టారిక అని చెబుతారు. అంటే అందరికన్నా పైన ఉండేటటువంటి అధినాయకురాలు.
మామూలుగా మిగిలిన అన్ని అవతారాలలోనూ ఆవిడ సింహం మీద కూర్చునో, పులి మీద కూర్చునో, అలా రథంలో వెళ్లి యుద్ధం చేసినట్టు ఎక్కడో కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆవిడ ఏమి చేయదు. సింహాసనం మీద చక్కగా కూర్చొని, హాయిగా ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిస్తుంది.
చేతిలో చెరుకు గడ పట్టుకొని ఈవిడను అపరాజిత దేవి అంటారు. పెద్ద పెద్ద ఆయుధాలు ఉండవు. చేతిలో చెరుకు గడ, కొన్ని ఆయుధాలు ఉంటాయి. అసలు ఆయుధాలు లేకపోవడం కాదు. ఆయుధాలు లేకపోయినట్లయితే ఎప్పుడైనా శత్రువులకు చులకన అయిపోతాం.
మనం కాటేయకపోయినా బుస కొట్టమన్నారుగా. అంచేత “జాగ్రత్త.. నా చేతిలో ఆయుధం ఉంది సుమా” అంటూ ఉండాలి. రాముడు కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్లి వాలి వెళ్లిన దారి మూసుకుపోలేదు ఇంకా అన్నాడు. అంటే జాగ్రత్త, నువ్వు తొందరగా మా పని చేయవలసిందే తప్ప నువ్వు ఇలా కూర్చుంటే కుదరదు అని చెప్పినట్టుగా ఉంటుంది.
ఆవిడ చిరునవ్వులు చిందిస్తూ దర్శనాన్ని ఇస్తుంది. ఎడమ చేత్తో చెరుకు గడను పట్టుకుంటుంది. కుడి చేత్తో అభయముద్ర చేస్తూ ఉంటుంది. “మీకు ఇటువంటి నేను ఇచ్చేది ఏమిటి? ఎడమ చేతిలో ఉన్న చెరుకు గడలో ఉన్నటువంటి తియ్యదనం లాంటిది ఇస్తాను” అని చెబుతున్నట్టుగా ఉంటుంది.
ఈవిడ షోడశ మంత్ర అధిష్టాన దేవత. ఎవరైతే పంచదశి మంత్రంలో సిద్ధిని పొందుతారో వాళ్లకి షోడశ అంటే పదహారు అక్షరాలు ఉన్నటువంటి మహా మంత్రం ఇస్తారు. ఈ మంత్రాధిష్టాన దేవతగా ఈవిడను అర్చిస్తే సమస్తమైనటువంటి శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్పే మాట.
ఈవిడ శ్రీచక్రానికి అధిష్టాన దేవత. ఇంతకు ముందు మూడు ఆవరణాల గురించి చెప్పుకున్నాం. వాటన్నిటి మీద కూడా ఉన్నటువంటి శక్తి స్వరూపిణి ఈవిడ. ఇచ్చా, జ్ఞాన, క్రియ శక్తులు ఈ మూడింటిని ఇస్తుంది. అంటే ఒక మంచి పని చేయాలనే ఇచ్చ, ఎలా చేయాలి అనే జ్ఞానం, చేయడానికి కావాల్సిన శక్తి, క్రియ.. ఈ మూడు రకాల శక్తులను ఇచ్చేటటువంటిది.
త్రిపురాత్రయంలో పూజలు అందుకునేది ఈవిడే. మూడు త్రిపురాల గురించి మాట్లాడుకున్నాం కదా.. ఒకటి, రెండు, మూడు అని. వాటిలో ఈవిడనే అపరాజిత దేవి అని కూడా అంటారు. ఈవిడ స్వయం ప్రకాశం కలిగిన జ్యోతి స్వరూపిణి. సాధారణంగా ఈ దశమి నాడు విజయదశమిగా ఎప్పుడు చెప్పుకుంటాం అంటే, విజయ నక్షత్రం అనేటటువంటిది ఆనాడు దర్శనం ఇచ్చేటట్టు దర్శనం ఇస్తుందట. ఎప్పుడు ఇస్తే దాన్ని విజయదశమిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది.
ఈవిడ అపరాజిత దేవి. అంటే ఎవరు ఈవిడను ఓడించటానికి వీలు లేదు. ఈవిడ పరాజిత కాదు. ఎప్పుడూ కూడా విజయం పొందుతుంది తప్ప, ఎప్పుడూ అపజయం పొందే అవకాశం లేదండి.
“సర్వోదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణి” అని చెబుతాం. సమస్తమైనటువంటి సాత్వికమైన ఆహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇష్టపడుతుంది. కనుక ఈనాడు దీక్ష స్వీకరించినటువంటి వారు కూడా దీక్షా విరమణ పూర్తయ్యి, అన్ని రకాల పదార్థాలు వేసుకొని, షడ్రసోపేతమైన భోజనం అమ్మవారికి నివేదన చేసి, తాము కూడా తింటారు.
