స్కూల్ బస్సులో మర్చిపోయారు.. ఒంటరిగా 7 గంటలు ఏడ్చిన పసివాడు — నోయిడా ఘటన షాక్!

నోయిడాలో ఐదేళ్ల చిన్నారి స్కూల్ బస్సులో నిద్రపోవడంతో బస్సు సిబ్బంది గమనించకుండా వెళ్లిపోయారు. ఏడు గంటలపాటు పార్కింగ్‌లో ఒంటరిగా ఉండిపోయిన బాలుడిని తర్వాత గుర్తించారు. బస్సు, స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Noida School Bus Incident
Noida School Bus Incident

నోయిడాలో గురువారం ఒక ఘటన అందరినీ కలచివేసింది. ఐదేళ్ల చిన్నారి బాలుడు స్కూల్ బస్సులో నిద్రపోవడంతో బస్సు సిబ్బంది గమనించకుండా వెళ్లిపోయారు. వేలాది రూపాయలు ఫీజు కట్టే స్కూల్ యాజమాన్యం కూడా ఒక పసివాడిని ట్రాక్ చేయలేకపోయింది. ఏడు గంటలు ఆ బాలుడు ఒంటరిగా పార్కింగ్‌లో బస్సులో కూర్చుని సాయం కోసం ఎదురు చూశాడు.

అసలేం జరిగింది?

ఉదయం బాలుడి తల్లి స్కూల్ బస్సు ఎక్కించింది. బస్సు స్కూల్‌కు చేరుకున్నప్పుడు అందరు పిల్లలూ దిగిపోయారు. కానీ వెనక సీట్లో నిద్రపోతున్న ఈ చిన్నారిని బస్సు అటెండర్ గానీ, డ్రైవర్ గానీ పట్టించుకోలేదు. బస్సును దూరంగా ఉన్న పార్కింగ్ ప్లేసులో నిలిపి డ్రైవర్ వెళ్లిపోయాడు. చుట్టూ వాహనాలు తప్ప ఒక్క మనిషీ లేని ఆ పార్కింగ్‌లో మెలకువ వచ్చిన పసివాడికి భయంతో దిక్కుతోచలేదు. బయటికి ఎలా వెళ్లాలో తెలియక గంటల తరబడి ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు.

మధ్యాహ్నం తల్లి స్కూల్‌కు వచ్చినప్పుడే అసలు విషయం బయటపడింది. కొడుకు స్కూల్‌కు రాలేదని యాజమాన్యం చెప్పడంతో తల్లి ఆందోళనకు గురైంది. బస్సు అటెండెన్స్ రికార్డులు చెక్ చేయగా బాలుడు బస్సు ఎక్కినట్లు నిర్ధారణ అయింది. స్కూల్ సిబ్బంది, బస్సు సిబ్బంది అందరూ కలిసి వెతికిన తర్వాత చివరకు పార్కింగ్‌లో నిలిపిన బస్సులో బాలుడు కనిపించాడు. బాలుడిని గుర్తించడానికి ఏకంగా ఏడు గంటలు పట్టింది.

పేరెంట్స్ ఆగ్రహం

ఈ ఘటన తెలిసిన వెంటనే తల్లిదండ్రుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. స్కూల్ బస్సుల్లో ప్రతిసారీ పిల్లలు దిగిన తర్వాత తప్పనిసరిగా హెడ్ కౌంట్ చేయాలని, ఆఖరి పిల్లాడు దిగే వరకు అటెండర్ బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం మాత్రం చివరి నిమిషంలో బస్సులు మార్చడం వల్ల పొరపాటు జరిగిందని, బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించామని వివరణ ఇచ్చింది. అయితే ఈ సమాధానంతో పేరెంట్స్ సంతృప్తి చెందలేదు.

ఇది కొత్త సమస్య కాదు

దేశవ్యాప్తంగా స్కూల్ బస్సుల్లో పిల్లలు మిగిలిపోయిన ఘటనలు పదేపదే జరుగుతున్నాయి. 2023లో హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటనలో ఒక చిన్నారి మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటి నుంచి స్కూల్ బస్సుల్లో తప్పనిసరిగా అటెండర్ ఉండాలని, GPS ట్రాకింగ్ అమర్చాలని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ అమలు మాత్రం సరిగా జరగడం లేదని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది.

పసిపిల్లల భద్రత విషయంలో స్కూళ్లు, బస్సు సిబ్బంది మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, అలసత్వం ప్రాణాంతకంగా మారే ముందే వ్యవస్థను సరిదిద్దుకోవాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »