ఎల్పీజీ, సిఎన్‌జీ సరఫరా స్థిరంగా… బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా సాధారణంగా కొనసాగుతుండగా, కొత్తగా 3.5 లక్షల పిఎన్‌జీ కనెక్షన్లు; ఎల్పీజీ వినియోగంపై పర్యవేక్షణ పెంపు, అక్రమాలపై కఠిన చర్యలు

LPG supply India
LPG supply India

దేశంలో ఇంధన సరఫరాపై ఎలాంటి అంతరాయం లేదని, రిఫైనరీలు సాధారణంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రూడ్ ఆయిల్ సరఫరా తగినంతగా ఉండటంతో పాటు రిటైల్ మార్కెట్‌లో కూడా ఎల్పీజీ, సిఎన్‌జీ అందుబాటు స్థిరంగా కొనసాగుతోందని పెట్రోలియం & నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు.

ప్రాధాన్య వినియోగదారులకు పిఎన్‌జీ (piped Natural Gas), సిఎన్‌జీ (Compressed Natural Gas) సరఫరా నిరంతరంగా కొనసాగుతుండగా, పారిశ్రామిక అవసరాలకు సుమారు 80% డిమాండ్‌ను తీర్చగలుగుతున్నట్లు అధికారులు తెలిపారు. పిఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. అదనపు ఎల్పీజీ కేటాయింపు, పాలసీ మద్దతుతో కేవలం మూడు వారాల్లోనే సుమారు 3.5 లక్షల కొత్త డొమెస్టిక్ మరియు కమర్షియల్ పిఎన్‌జీ కనెక్షన్లు యాక్టివేట్ కావడం గమనార్హం.

ఇక ఎల్పీజీ సరఫరా విషయానికి వస్తే, డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు కేటాయింపులు చేసింది. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్‌లో 50% వరకు రాష్ట్రాలకు అందుబాటులో ఉంచుతూ, రెస్టారెంట్లు, హోటళ్లు, ఇండస్ట్రియల్ క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్లు వంటి ప్రాధాన్య రంగాలకు సరఫరా చేస్తున్నారు. వలస కార్మికుల కోసం 5 కిలోల సిలిండర్లను కూడా అందిస్తున్నారు. ఇప్పటివరకు 20 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు సుమారు 15,800 టన్నుల ఎల్పీజీని వినియోగించుకున్నాయి.

అదేవిధంగా, 15 రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపులు కూడా జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలతో సమన్వయం కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఇక బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. ఇప్పటికే 32 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. ఇప్పటివరకు 37,000 కంటే ఎక్కువ దాడులు జరగగా, 550 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 150 మందిని అరెస్ట్ చేశారు. ఆయిల్ కంపెనీలు కూడా 234 షోకాజ్ నోటీసులు జారీ చేశాయి.

ఇటీవలి కాలంలో ఇంధన సరఫరాపై పుకార్లు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, కేంద్రం ఇచ్చిన ఈ స్పష్టత ప్రజలకు నమ్మకం కలిగించే అంశం. ముఖ్యంగా ఎల్పీజీపై భయం వల్ల జరిగే “పానిక్ బుకింగ్” వల్ల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగకుండా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

ఇక పిఎన్‌జీ కనెక్షన్ల పెంపు నగరాల్లో శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కీలక అడుగు. ఇది కాలుష్య నియంత్రణలో కూడా సహాయపడుతుంది.

ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా, సరఫరా సవ్యంగా కొనసాగుతున్నందున ప్రజలు అనవసరంగా నిల్వలు చేసుకోవడం మానుకుని, అవసరానికి తగ్గట్టుగా వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read: ఇంధ‌న కొర‌త అధిగ‌మించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం.. కమర్షియల్ కోటా 20% పెంపు

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »