మార్చి 3న సంపూర్ణ చంద్ర గ్రహణం… Blood Moon ఎర్రగా మెరుస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో ఎంతసేపు కనిపిస్తుంది?

March 3 Total Lunar Eclipse 2026 – Blood Moon. Telangana, APలో గ్రహణ సమయం, దర్శన కాలం, రాశి ఫలితాలు చెక్ చేయండి.

Blood Moon 2026
Blood Moon 2026 (Image Credit : NASA)

మార్చి 3, 2026న ప్రపంచవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం (Total Lunar Eclipse) ఏర్పడనుంది. భూమి నీడలోకి చంద్రుడు పూర్తిగా జారిపోవడంతో చంద్రుడు గాఢ ఎర్రటి రంగులో మెరుస్తాడు. ఈ ప్రత్యేక దృశ్యాన్ని సాధారణంగా “Blood Moon” అని పిలుస్తారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA ప్రకారం ఈ గ్రహణం తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్ర పరిసర ప్రాంతాలు, అమెరికాస్‌లో స్పష్టంగా కనిపించనుంది. టెలిస్కోప్ అవసరం లేకుండా కళ్లతోనే వీక్షించవచ్చు.

పంచాంగం ప్రకారం ఫాల్గుణ శుక్లపౌర్ణమి రోజైన మార్చి 3న ఈ గ్రహణం సంభవిస్తుంది. గ్రహణ స్పర్శకాలం మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషాలకు ప్రారంభమవుతుంది. నిమీలన కాలం 4:33, మధ్యకాలం 5:03, ఉన్మీలన కాలం 5:32గా ఉంటుంది. మోక్షకాలం సాయంత్రం 6:46గా సూచించారు. అయితే సూర్యాస్తమయం 6:02 గంటలకు, చంద్రోదయం 6:04 గంటలకు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పూర్తి గ్రహణ దశ కనిపించదు. మోక్షకాలానికి సమీపంలో మాత్రమే గ్రహణ బింబం దర్శనమిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో గ్రహణ దర్శనం ఎంతసేపు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రహణం కొద్ది నిమిషాలపాటు మాత్రమే కనిపించనుంది. హైదరాబాద్‌లో సుమారు 24 నిమిషాలు, విజయవాడలో 36 నిమిషాలు, నల్గొండలో 27 నిమిషాలు, నెల్లూరులో 28 నిమిషాలపాటు గ్రహణ దృశ్యం దర్శనమిస్తుంది. చంద్రోదయం సమయానికి గ్రహణం చివరి దశలో ఉండటంతో పూర్తి ఎర్రటి దృశ్యం కొంతసేపే కనిపిస్తుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువసేపు గ్రహణం కనిపించనుండగా, పశ్చిమ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం పూర్తిగా కనిపించదు. ముంబైలో చంద్రోదయం ఆలస్యంగా ఉండటంతో గ్రహణం స్పష్టంగా కనిపించకపోవచ్చు. గుజరాత్‌లోని ద్వారక, లక్షద్వీప్ ప్రాంతాల్లో దర్శనం ఉండదు.

శాస్త్రీయ వివరణ ఏమిటి?

సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో భూమి సూర్యకాంతిని పూర్తిగా అడ్డుకుంటుంది. అయితే భూమి వాతావరణం గుండా వంగి వచ్చే ఎర్రటి కాంతి చంద్రుడిపై పడుతుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఆకాశం ఎర్రగా కనిపించడానికి కారణమయ్యే అదే ప్రక్రియ ఇక్కడ కూడా పనిచేస్తుంది. అందుకే చంద్రుడు ఎర్రటి రంగులో మెరుస్తాడు. ఇది పూర్తిగా సహజ ఖగోళ సంఘటన మాత్రమే.

ఆలయాలు, ఆచారాలు

చంద్రగ్రహణం సందర్భంగా అనేక ఆలయాలు ఉదయం నుంచే మూసివేసి, మోక్షకాలం అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. భక్తులు గ్రహణం పూర్తయ్యే వరకు ఆలయ దర్శనాలు నిలిపివేస్తారు. పంచాంగ నిపుణుల సూచనల ప్రకారం మధ్యాహ్నం 12 గంటల లోపు భోజనం ముగించుకోవడం మంచిదని చెబుతున్నారు. సూర్యాస్తమయం సమయానికి పట్టుస్నానం, మోక్షకాలం తర్వాత విడుపు స్నానం చేయడం ఆచారం.

గర్భిణీలు సాయంత్రం 5 గంటల నుంచి 6:46 వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. అయితే వైద్యపరంగా ఈ విషయంపై శాస్త్రీయ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు.

ఏ రాశులపై ప్రభావం?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం పుబ్బ నక్షత్రం, సింహరాశిలో సంభవిస్తోంది. అందువల్ల పుబ్బ నక్షత్రం వారు, సింహరాశి వారు గ్రహణం చూడకూడదని సూచిస్తున్నారు.

రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి:

మేషం – మానసిక అశాంతి

వృషభం – సుఖం

మిథునం – లాభం

కర్కాటకం – వ్యయం

సింహం – ఘాతం

కన్యా – హాని

తులా – ధనలాభం

వృశ్చికం – వ్యధ

ధనస్సు – చింత

మకరం – సౌఖ్యం

కుంభం – స్త్రీ కష్టం

మీనం – అతి కష్టం

ఈ ఫలితాలు వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడినవే.

దాదాపు ఆరు బిలియన్ మందికి కనిపించే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అరుదైన ఖగోళ సంఘటనగా పరిగణించబడుతోంది. ఖగోళ శాస్త్రంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ఇది ప్రత్యక్ష అధ్యయన అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొద్దిసేపే కనిపించినా, ఆకాశాన్ని గమనించే వారికి ఇది ప్రత్యేక అనుభవం కానుంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »