పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ చర్చలు జరుగనున్నాయి.
చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం
ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతుండటం గమనార్హం. అయితే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.
యుద్ధం వల్ల ఇబ్బందులు
ఇదే అంశంపై ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన భద్రతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.
Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లోకి అన్నా కొనిదెల ఎంట్రీ… ‘అన్నయ్యనా? బావగారునా?’ పోస్ట్ వైరల్
పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ఏర్పడుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రస్తుతం యుద్ధం తీవ్రమైన ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాపై ప్రభావం పడుతోంది” అని ఆయన తెలిపారు.
కేంద్రం తీసుకుంటున్న చర్యలు
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రత కూడా ప్రధాన అంశంగా మారింది. లక్షల సంఖ్యలో భారతీయులు అక్కడ ఉపాధి పొందుతుండటంతో వారి రక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అలాగే హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లో భారతీయ సిబ్బంది ఉండటం మరో ఆందోళనగా మారింది.
ఇప్పటికే యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 4.25 లక్షల మందిని స్వదేశానికి తరలించినట్లు సమాచారం. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.
సీఎంల సమావేశంలో కీలక చర్చలు
ఈ నేపథ్యంలో సీఎంలతో జరగనున్న సమావేశంలో రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరఫరా వ్యవస్థను నిలబెట్టే చర్యలు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండే విధానాలపై ప్రధాని మోదీ సూచనలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సమావేశం దేశ ఆర్థిక, భద్రతా పరమైన కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.


