Bhogapuram Airport | విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. జులై నెల నుంచే విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని విమానయాన సంస్థలు తమ సర్వీసులను భోగాపురం నుంచి నిర్వహించనున్నట్లు ప్రయాణికులకు సమాచారం అందించాయి. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు అనుబంధ సంస్థ అయిన ‘స్కూట్’ కూడా తన వెబ్‌సైట్‌లో విశాఖపట్నం ప్రస్తుత విమానాశ్రయం బదులు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే సర్వీసులు నడుస్తాయని ప్రకటించింది. ఈ మేరకు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం (వీటీజెడ్) నుంచి నడుస్తున్న సర్వీసులు.. జులై 8 నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కొనసాగుతాయని అందులో పేర్కొంది. విశాఖపట్నానికి సుమారు 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయనగరం జిల్లాలోని భోగాపురంలో ఈ గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మిస్తోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా మారుతుందని భావిస్తోంది.
Read Also : ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!
రూ.4700 కోట్ల వ్యయంతో..
దాదాపు 2,700 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ విమానాశ్రయ ప్రాజెక్టుకు రూ.4,700 కోట్లకుపైగా వ్యయం అవుతోంది. జీఎంఆర్ గ్రూప్ పీపీపీ విధానంలో నిర్మాణ పనులను చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు మొదటిగా 2015లో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో పునాది వేయగా, తర్వాతి దశలో అవసరమైన అనుమతులు, భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యాయి. అనంతరం 2023లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్మాణ పనులకు అధికారికంగా శంకుస్థాపన చేసి పనులను వేగవంతం చేశారు. ప్రస్తుతం విమానాశ్రయ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇటీవల కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పనుల పురోగతిని సమీక్షించి 99 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. జూన్ చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసి, జులైలో ప్రారంభోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జులై 5, 8 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వీలుకాపోతే ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదైనా ఒక రోజు ప్రారంభోత్సవానికి సమయం కేటాయించాలని ప్రధానికి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే, జులై 5న ప్రధాని రాష్ట్రానికి వచ్చే అవకాశాలున్నాయి.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. ప్రకటించిన చంద్రబాబు..
ఏటా 40లక్షల మందితో..
అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ ఎయిర్‌పోర్టులో ఆధునిక టెర్మినల్, విస్తృత రన్‌వేలు, కార్గో హబ్, లాజిస్టిక్స్ సెంటర్, భారీ పార్కింగ్ ప్రాంతం, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. తొలి దశలోనే ఏటా 40 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి కోటికిపైగా ప్రయాణికులకు సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే ఏరోసిటీ, ఏవియేషన్ అకాడమీ, విమానాల మెయింటెనెన్స్ సదుపాయాలు భాగం కానున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పర్యాటకం, ఐటీ, పారిశ్రామిక రంగాలకు భారీ ఊతం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విశాఖ నగరంపై ఉన్న ఒత్తిడి తగ్గడంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.
Read Also : ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. భారీగా పెట్టుబడులు పెడుతున్న ద్విచక్ర వాహనాల కంపెనీ..!


