ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదాలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్టీ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆయనను తొలగించిన తర్వాత, ఆయనపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేసిన చద్దా, తనపై జరుగుతున్నది ముందే ప్రణాళికాబద్ధంగా సాగుతున్న దాడి అని అభివర్ణించారు.
నేను గాయపడ్డాను.. అందుకే మరింత ప్రమాదకరంగా మారాను అంటూ ధురంధర్ 2 సినిమా డైలాగ్‌తో పార్టీకి ఘాటుగా సమాధానం ఇచ్చారు. తనపై చేసిన ప్రతి ఆరోపణను తాను ఒక్కొక్కటిగా బయటపెడతానని స్పష్టం చేశారు.
తనపై ఆప్ చేస్తున్న ఆరోపణలన్నీ కుట్రపూరితమైనవని రాఘవ్ చద్దా కామెంట్ చేశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెబితే నిజం కాదు కాబట్టే, తాను వాస్తవాలను బయటపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.
వివరణ ఇచ్చిన చద్దా..
ఆప్ తనపై మూడు ప్రధాన ఆరోపణలు చేసిందని పేర్కొన్న చద్దా, వాటిపై తన వివరణ ఇచ్చారు. ప్రతిపక్షాలు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన సమయంలో తాను వారితో కలవలేదన్న ఆరోపణను పూర్తిగా ఖండించారు. పార్లమెంట్‌లో ఎక్కడైనా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. ఆ ఫుటేజీని బయటపెడితే నిజం తేలిపోతుంది అని అన్నారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ అభిశంసన తీర్మానంపై సంతకం చేయలేదన్న ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ విషయంపై ఎవరూ తనను సంప్రదించలేదని, పార్టీకి చెందిన మరికొంత మంది ఎంపీలు కూడా సంతకం చేయలేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు తనను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. రాజ్యసభలో అలాంటి తీర్మానాలకు 50 మంది సభ్యుల మద్దతు సరిపోతుందని చెప్పారు.
భావోద్వేగానికి గురైన చద్దా..
పార్లమెంట్‌లో తాను చిన్నచిన్న అంశాలపైనే మాట్లాడుతున్నానన్న విమర్శలపై స్పందిస్తూ చద్దా భావోద్వేగానికి గురయ్యారు. తాను గందరగోళం సృష్టించడానికి లేదా మైకులు పగలగొట్టడానికి పార్లమెంట్‌కు వెళ్లడం లేదని స్పష్టం చేశారు.
ప్రజల సమస్యలను లేవనెత్తడమే తన లక్ష్యమని చెబుతూ, జీఎస్టీ, ఆదాయపు పన్ను, పంజాబ్ నీటి సమస్య, ఢిల్లీ వాయు కాలుష్యం, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, ప్రజారోగ్య వ్యవస్థ, రైల్వే ప్రయాణికుల సమస్యల వంటి కీలక అంశాలను ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు.
నేను పార్లమెంట్‌కు నా సత్తా చూపించడానికి వెళ్తాను.. గందరగోళం కోసం కాదు. నా నాలుగేళ్ల పార్లమెంట్ రికార్డులు చూస్తే ఇది స్పష్టమవుతుంది అని చద్దా అన్నారు.
ఆప్‌తో విభేదాలు మరింత ముదురుతున్న సూచనలు కనిపిస్తున్న వేళ, రాఘవ్ చద్దా చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.