తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపుగా మారుతున్న అసెంబ్లీ ఎన్నికల వేళ,భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విడుదల చేసిన తొలి అభ్యర్థుల జాబితా చర్చనీయాంశంగా మారింది. 27 మంది అభ్యర్థులతో ప్రకటించిన ఈ జాబితాలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు లేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ఈ నేపథ్యంలో వస్తున్న ఊహాగానాలకు తెరదించిన అన్నామలై, తాను స్వచ్ఛందంగానే ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే పార్టీ కోర్ కమిటీకి లిఖితపూర్వకంగా తన నిర్ణయాన్ని తెలియజేశానని వెల్లడించారు.
విజయం కోసం పని చేస్తా…
చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేను ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయను. పార్టీ టికెట్ నిరాకరించిందనే వార్తల్లో నిజం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే అభ్యర్థుల విజయానికి పనిచేయాలనేదే నా లక్ష్యం” అని తెలిపారు. తన నిర్ణయాన్ని గౌరవించిన పార్టీ నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రకటనతో అన్నామలై రాష్ట్రవ్యాప్తంగా ప్రచార బాధ్యతలు చేపట్టనున్నట్లు స్పష్టమైంది.
నేను ఏ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయనని ఇప్పటికే పార్టీ కోర్ కమిటీకి లిఖితపూర్వకంగా తెలియజేశాను. కాబట్టి నాకు టికెట్ నిరాకరించారనే విషయం సరైంది కాదు. నిజానికి, నేను స్వయంగా పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఈ విషయం మీడియాల్లో చర్చకు దారి తీసిన నేపథ్యంలో, నేను స్వయంగా స్పష్టత ఇవ్వాలని భావించాను. నా నిర్ణయాన్ని గౌరవించి, ఎన్డీయే కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసే అవకాశం కల్పించినందుకు బీజేపీ నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
మహిళలకు ప్రాధాన్యత..
ఇక అభ్యర్థుల ఎంపికలో బీజేపీ వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఐదుగురు మహిళా అభ్యర్థులకు కీలక స్థానాల్లో అవకాశం కల్పించింది. పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను మైలాపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది.
అలాగే మోదక్కురిచ్చి నుంచి కీర్తికా శివకుమార్, కోయంబత్తూరు ఉత్తరం నుంచి వనతి శ్రీనివాసన్, అరంతాంగి నుంచి కవిత శ్రీకాంత్, విలవన్కోడ్ నుంచి ఎస్ విజయధరణి వంటి మహిళా అభ్యర్థులు పోటీకి దిగుతున్నారు. దళిత ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపైనా బీజేపీ దృష్టి పెట్టింది. రాసిపురం, అవినాశి, మనమదురై, వాసుదేవనల్లూరు వంటి స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది.
ముఖ్యంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎ్ మురుగన్‌ను అవినాశి (ఎస్సీ రిజర్వ్) నుంచి బరిలోకి దింపడం ప్రత్యేకంగా నిలిచింది. కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా చూస్తే, అన్నామలై పోటీకి దూరంగా ఉండటం, మహిళలు మరియు ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలతో బీజేపీ
ఈసారి తమిళనాడులో భిన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది. కాగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నామలై పోటీ చేయగా, డీఎంకే అభ్యర్థి ఆర్.ఇలాంగో చేతిలో 24,000 ఓట్ల తేడాతో ఓటమిపాలయిన విషయం తెలిసిందే.