గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్‌లో భారీ పేలుడు పదార్థాల పట్టివేత…పేలుడు కుట్ర భ‌గ్నం

గతంలో నవంబర్ 2025లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో పాటు పలు ప్రధాన ఉగ్రదాడుల్లో ఇదే రకమైన పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తు చేశారు.

Nagaur Ammonium Nitrate Seizure
  • గణతంత్ర దినోత్సవ వేళ రాజస్థాన్ నాగౌర్ జిల్లాలో పోలీసులు సుమారు 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు భారీ పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

  • హర్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయగా, అక్రమ మైనింగ్‌కు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

  • ఉగ్రకోణం ఉందా అనే అనుమానంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉండటంతో భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసిన వేళ, రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో పోలీసులు భారీ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. నాగౌర్ జిల్లా హర్సౌర్ గ్రామ పరిధిలోని ఒక పొలంపై పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి, పెద్ద ఎత్తున అమ్మోనియం నైట్రేట్‌తో పాటు ఇతర పేలుడు సామాగ్రిని పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తిని కూడా రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు.

పక్కా సమాచారంతో నాగౌర్ జిల్లా ఎస్పీ మృదుల్ కచ్చవా నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది. సోదాల్లో 187 గోనె సంచుల్లో దాచిన సుమారు 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్ బయటపడింది. గతంలో నవంబర్ 2025లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనతో పాటు పలు ప్రధాన ఉగ్రదాడుల్లో ఇదే రకమైన పేలుడు పదార్థాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తు చేశారు. ఈ కారణంగా ఈ పట్టివేత ప్రాధాన్యత మరింత పెరిగింది.

Also Read:పరీక్షల ఒత్తిడితో గోవాకి వెళ్లిన విద్యార్ధి. అక్క UPSC ఫీజు డబ్బులతో పరారీ!

స్వాధీనం చేసుకున్న పేలుడు సామాగ్రి వివరాలు ఇవి:

187 గోనె సంచుల్లో సుమారు 9,550 కిలోల అమ్మోనియం నైట్రేట్

9 కార్టన్ల డెటొనేటర్లు

12 కార్టన్లు, 15 బండిళ్ల బ్లూ ఫ్యూజ్ వైర్

12 కార్టన్లు, 5 బండిళ్ల రెడ్ ఫ్యూజ్ వైర్

ఈ కేసులో హర్సౌర్ గ్రామానికి చెందిన సులేమాన్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై గతంలోనే మూడు క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు ఎస్పీ మృదుల్ కచ్చవా వెల్లడించారు. ప్రాథమిక విచారణలో, ఈ పేలుడు పదార్థాలను చట్టవిరుద్ధమైన మైనింగ్ కార్యకలాపాలకు సరఫరా చేస్తున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప‌లు అనుమానాలు:

భారీగా పేలుడు పదార్థాలు నిల్వ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

ఈ వ్యవహారంలో ఏదైనా ఉగ్రకోణం ఉందా అనే అంశంపై కూడా విచారణ

కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం

త్వరలోనే వారు నిందితుడిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం సులేమాన్ ఖాన్‌పై పేలుడు పదార్థాల చట్టం (Explosives Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేళ ఈ తరహా భారీ పేలుడు పదార్థాల పట్టివేత జరగడంతో, భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »