పార్టీ మ్యానిఫెస్టో కార్యక్రమంలో విజ‌య్‌కి త‌ప్పిన ప్ర‌మాదం.. కాస్త అయితే క‌న్ను పోయేదిగా..!

చెన్నైలో టీవీకే మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇదే సమయంలో ఆయన ప్రకటించిన సంక్షేమ హామీలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Actor and politician Vijay releasing the TVK party manifesto for 2026 Tamil Nadu elections in Chennai
TVK Party Manifesto 2026

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారుతున్న టీవీకే పార్టీ నాయకుడు విజ‌య్ 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. చెన్నై నగరంలోని నంగంబాక్కంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కార్యక్రమం ప్రారంభంలో విజయ్ ఒక రైతుకు మేనిఫెస్టో కాపీని అందజేసి సభను ప్రారంభించారు. అయితే ఈ వేడుకలో చిన్నపాటి అపశృతి చోటుచేసుకుంది. వేదికపైకి వచ్చిన ఒక రైతు, విజయ్‌కు పైరుతో పాటు ఒక పరికరాన్ని అందించే సమయంలో అది అకస్మాత్తుగా పైకి లేచి ఆయన కంటికి తగిలే పరిస్థితి ఏర్పడింది. అప్రమత్తంగా స్పందించిన విజయ్ వెంటనే పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

శాలువాతో సత్కారం..

ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న విజయ్ ఆ రైతును గౌరవంగా శాలువా కప్పి సత్కరించడం గమనార్హం. ఈ సంఘటన ఆయన సహనాన్ని, వ్యక్తిత్వాన్ని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇటీవల తూత్తుకుడిలో జరిగిన ర్యాలీలో కూడా విజయ్ అభిమానులకు గాయాలైన విషయం తెలిసిందే. ఆయన కాన్వాయ్‌ను అనుసరిస్తున్న ఓ అభిమాని బైక్ అదుపుతప్పి పడిపోవడంతో వెనుక వస్తున్న వాహనాలు ఢీకొని పలువురు గాయపడ్డారు. అలాగే కరూర్‌లో జరిగిన సభలో తొక్కిసలాట జరిగి మరణాలు సంభవించడం కూడా కలకలం రేపింది.

మేనిఫెస్టోలో కీలక హామీలు

టీవీకే విడుదల చేసిన మేనిఫెస్టోలో పలు సంక్షేమ పథకాలు ప్రాధాన్యత పొందాయి. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు. పోలీసు సిబ్బందికి మూల వేతనంలో రూ.25,000 పెంపు హామీ ఇచ్చారు.

మత్స్యకారులకు వార్షిక చేపల వేట నిషేధ కాలంలో ఇచ్చే సాయాన్ని రూ.8,000 నుంచి రూ.20,000కు పెంచడమే కాకుండా, బ్యాంకు రుణాలు కూడా అందిస్తామని తెలిపారు. అదనంగా వివాహాలకు 8 గ్రాముల బంగారం అందజేస్తామని ప్రకటించారు.

వంద రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు..

మహిళలకు ప్రత్యేకంగా 60 ఏళ్లలోపు వారికి నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పేద కుటుంబాలకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పిస్తామని తెలిపారు.

విద్యా రంగంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల కుటుంబాలకు ఏటా రూ.15,000 డిపాజిట్, ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

తీర ప్రాంత అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి శాశ్వత గృహాలు నిర్మిస్తామని, డీజిల్ మోటారు పడవలకు నెలవారీ ఇంధన కోటాను 1,800 లీటర్ల నుంచి 3,500 లీటర్లకు పెంచుతామని తెలిపారు.

మొత్తంగా, టీవీకే మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ హామీలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, విజయ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన ఘటన కూడా అంద‌రి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also read:

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »