వాషింగ్టన్‌లో ట్రంప్‌పై హత్యాయత్నం .. సీక్రెట్ సర్వీస్ అప్రమత్తతతో త‌ప్పిన ప్రమాదం

వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా కాల్పుల కలకలం రేపిన ఘటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. సీక్రెట్ సర్వీస్ వేగవంతమైన చర్యలతో పెద్ద ప్రమాదం తప్పింది.

White House Correspondents Dinner Shooting
White House Correspondents Dinner Shooting

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం మధ్యలో జరిగిన కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఏప్రిల్ 25, 2026 రాత్రి వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో ఈ ఘటన‌ చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు సుమారు 2,600 మంది ప్రముఖులు హాజరయ్యారు.

విందు కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా 7 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించడంతో హోటల్ అంతటా భయాందోళన నెలకొంది. అక్కడున్న అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గందరగోళంలో వైన్ గ్లాసులు పగిలిపోవడం, అరుపులు వినిపించడం వంటి ఘటనలు చోటుచేసుకుని అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది.

వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు..

కాల్పులు మొదలైన వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా స్పందించారు. ట్రంప్, జేడీ వాన్స్ సహా కీలక నాయకులను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. “స్టే డౌన్” అంటూ అతిథులను హెచ్చరిస్తూ పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించారు. ఈ వేగవంతమైన చర్యల వల్ల ఎవరూ గాయపడకుండా పెద్ద ప్రమాదం తప్పింది.

భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, నిందితుడు అసలు బ్యాంకెట్ హాల్‌లోకి ప్రవేశించలేకపోయాడు. సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్దే అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గుర్తించి అడ్డుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం తరలించారు. కాల్పులు హాల్ వెలుపలే జరిగినట్లు సమాచారం.

ఇలాంటి ఘ‌ట‌న రెండో సారి..

ఈ ఘటనపై ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ, సీక్రెట్ సర్వీస్ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థల చాకచక్యాన్ని ప్రశంసించారు. షూటర్‌ను తక్షణమే పట్టుకున్నారని, భద్రతా కారణాల వల్ల కార్యక్రమంపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈ కాల్పుల సమయంలో డిన్నర్ ప్రారంభ దశలోనే ఉండటం గమనార్హం. అతిథులు తమ మొదటి కోర్సు తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. కొద్ది సేపటి తరువాత పరిస్థితి అదుపులోకి రావడంతో కార్యక్రమాన్ని తిరిగి కొనసాగించే అవకాశంపై నిర్వాహకులు ఆలోచించారు.

ఇక వాషింగ్టన్ హిల్టన్ హోటల్ చరిత్రలో ఇలాంటి ఘటన ఇదే రెండోసారి కావడం గమనించదగిన విషయం. 1981లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్‌పై కూడా ఇదే ప్రాంతంలో హత్యాయత్నం జరిగింది. తాజా ఘటనతో భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చ ప్రారంభమైంది.

ప్రస్తుతం వాషింగ్టన్ నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిందితుడి నేపథ్యం, ఉద్దేశ్యంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపడంతో ప్రపంచ దేశాలు అమెరికా భద్రతా పరిస్థితులను గమనిస్తున్నాయి.

Also Read:

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »