మరణించిన వారి ఆధార్ ఏం చేయాలి? UIDAI కొత్త నిబంధనతో క్లారిటీ

కుటుంబంలో ఎవరైనా మరణిస్తే వారి ఆధార్ కార్డును ఏం చేయాలి? మరణ సమాచారాన్ని UIDAIకి ఎలా తెలియజేయాలి, ఆధార్ డీయాక్టివేట్ ఎలా అవుతుంది, కార్డును అలాగే ఉంచితే ఏం జరుగుతుందో తెలుసుకోండి.

UIDAI Aadhaar Deactivation
UIDAI Aadhaar Deactivation

ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వంటి డాక్యుమెంట్లను ఏం చేయాలి? ముఖ్యంగా ఆధార్ కార్డును అలాగే ఉంచితే ఏమైనా సమస్య వస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి UIDAI కీలకమైన నిబంధన తీసుకొచ్చింది.

ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. గతంలో మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడానికి ప్రత్యేకమైన వ్యవస్థ లేదు. 2023లో కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని పార్లమెంట్‌లో వెల్లడించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 2025లో UIDAI నిబంధనల్లో మార్పులు చేసింది.

కొత్త నిబంధన ప్రకారం ఆధార్ నంబర్ హోల్డర్ చనిపోయినట్లు UIDAIకి సమాచారం అందితే, ఆ సమాచారాన్ని ముందుగా ధ్రువీకరిస్తారు. మరణం నిజమని నిర్ధారణ అయిన తర్వాత ఆ వ్యక్తి ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తారు.

ఇందుకోసం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రాల చీఫ్ రిజిస్ట్రార్ వంటి సంస్థల నుంచి కూడా మరణానికి సంబంధించిన సమాచారాన్ని UIDAI తీసుకోవచ్చు. అంటే మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు ఆధార్ కార్డును స్వయంగా తీసుకెళ్లి రద్దు చేయాల్సిందే అనే పరిస్థితి లేదు. అధికారికంగా మరణ సమాచారం UIDAIకి చేరి, అది వెరిఫై అయిన తర్వాత డీయాక్టివేషన్ ప్రక్రియ జరుగుతుంది.

అయితే కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రక్రియలో సహకరించవచ్చు. UIDAI మై ఆధార్ పోర్టల్‌లో ‘రిపోర్టింగ్ ఆఫ్ డెత్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మెంబర్’ అనే సదుపాయాన్ని తీసుకువచ్చింది. మరణ ధ్రువీకరణ పత్రం పొందిన తర్వాత కుటుంబ సభ్యులు మరణించిన వ్యక్తి ఆధార్ నంబర్, డెత్ రిజిస్ట్రేషన్ నంబర్, అవసరమైన ఇతర వివరాలను సమర్పించవచ్చు. ఆ వివరాలను UIDAI పరిశీలించిన తర్వాత ఆధార్‌ను డీయాక్టివేట్ చేస్తుంది.

ఆధార్‌ను అలాగే ఉంచితే ఏం జరుగుతుంది?

ఇక అసలు ప్రశ్న.. ఆధార్‌ను అలాగే వదిలేస్తే ఏం జరుగుతుంది? కేవలం ఆధార్ కార్డు మన దగ్గర ఉండటం వల్ల వెంటనే ఏదైనా సమస్య వస్తుందని కాదు. కానీ మరణించిన వ్యక్తి ఆధార్ యాక్టివ్‌గా ఉండటం వల్ల గుర్తింపు దుర్వినియోగం, మోసం లేదా సంక్షేమ ప్రయోజనాలను అనధికారికంగా పొందే ప్రయత్నాలకు అవకాశం ఉండవచ్చని UIDAI చెబుతోంది.

అందుకే మరణించిన వ్యక్తుల ఆధార్‌ను గుర్తించి డీయాక్టివేట్ చేసే ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే UIDAI భారీ స్థాయిలో ఈ ప్రక్రియ చేపట్టింది. 2025 నవంబర్ నాటికి రెండు కోట్లకు పైగా, 2026 ఫిబ్రవరి నాటికి 2.5 కోట్లకు పైగా మరణించిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసినట్లు UIDAI వెల్లడించింది.

ఆధార్ నంబర్‌ను మరొకరికి కేటాయిస్తారా?

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తికి ఇచ్చిన ఆధార్ నంబర్ అతనికే ప్రత్యేకంగా ఉంటుంది. వ్యక్తి మరణించిన తర్వాత కూడా ఆ నంబర్‌ను వేరే వ్యక్తికి ఇవ్వడం జరగదు.

అయితే పొరపాటున ఒక వ్యక్తిని చనిపోయిన వ్యక్తిగా రిపోర్ట్ చేసి, అతని ఆధార్ డీయాక్టివేట్ అయితే దీనికి UIDAI ప్రత్యేకమైన విధానం పెట్టింది. తాను బతికే ఉన్నానని నిరూపించుకోవడానికి సంబంధిత UIDAI రీజినల్ లేదా స్టేట్ ఆఫీస్‌ను సంప్రదించి అవసరమైన బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు.

కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే.. ఇంట్లో ఎవరైనా మరణించిన తర్వాత వారి ఆధార్ కార్డును పారేయాల్సిన అవసరం లేదు. కానీ మరణ ధ్రువీకరణ పూర్తయిన తర్వాత ఆ మరణ సమాచారాన్ని UIDAIకి రిపోర్ట్ చేయడం మంచిది. వివరాలు వెరిఫై అయిన తర్వాత UIDAI ఆ ఆధార్ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఆధార్ రికార్డులు కూడా అప్‌డేట్‌గా ఉంటాయి. భవిష్యత్తులో ఆ గుర్తింపును దుర్వినియోగం చేసే అవకాశాలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »