మీ ఇంట్లో ఐదేళ్లలోపు చిన్నారి ఉన్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోండి. చిన్న పిల్లలకు ఇచ్చే ఆధార్‌ను సాధారణంగా బాల ఆధార్ అని పిలుస్తారు. పుట్టిన వెంటనే కూడా పిల్లలకు ఆధార్ నమోదు చేయవచ్చు. అయితే ఐదేళ్లలోపు పిల్లల ఆధార్ విషయంలో కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉంటాయి.
ముందుగా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఐదేళ్లలోపు పిల్లలకు ఫింగర్ ప్రింట్లు, ఐరిస్ వంటి బయోమెట్రిక్స్ తీసుకోరు. పిల్లల పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా వంటి వివరాలతో పాటు పిల్లల ఫొటోను మాత్రమే నమోదు చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు లేదా లీగల్ గార్డియన్ తమ ఆధార్‌తో పిల్లల తరఫున అథెంటికేట్ చేయాలి.
బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి
డాక్యుమెంట్ల విషయానికి వస్తే.. మొదటిది పిల్లల బర్త్ సర్టిఫికేట్. ముఖ్యంగా 2023 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత పుట్టిన పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి అని UIDAI చెబుతోంది.
బర్త్ సర్టిఫికేట్‌ను సంబంధిత రిజిస్ట్రార్, మున్సిపల్ కార్పొరేషన్ లేదా ఇతర అధికారిక సంస్థ జారీ చేసి ఉండాలి.
తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ అవసరం
రెండవది.. తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్. పిల్లల ఆధార్ నమోదులో తల్లి లేదా తండ్రి లేదా అవసరమైతే లీగల్ గార్డియన్ ఆధార్ వివరాలు ఇవ్వాలి. HoF ఆధారంగా నమోదు చేస్తే సంబంధాన్ని నిరూపించే డాక్యుమెంట్ కూడా అవసరం కావచ్చు.
అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది. తల్లిదండ్రుల ఆధార్‌లో చిరునామా మార్చాల్సి ఉంటే ముందుగా తల్లిదండ్రుల ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే పిల్లల ఆధార్‌లోని చిరునామా లింక్ చేసిన తల్లిదండ్రులు లేదా గార్డియన్ చిరునామాతో సంబంధం కలిగి ఉంటుంది.
బాల ఆధార్ కోసం ఎలా అప్లై చేయాలి?
పిల్లలను తీసుకుని అధికారిక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లాలి. అక్కడ ఎన్‌రోల్‌మెంట్ ఫారమ్ నింపాలి. పిల్లలకు సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించాలి. తల్లిదండ్రుల్లో ఒకరు తమ ఆధార్ ద్వారా అథెంటికేట్ చేయాలి. అనంతరం పిల్లల ఫొటో తీసుకుంటారు. దీంతో నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
కొత్త ఆధార్ నమోదుకు ఎలాంటి ఛార్జ్ లేదు
మరో ముఖ్యమైన విషయం.. కొత్తగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ చేయడానికి ఎలాంటి ఛార్జ్ లేదు. UIDAI ప్రకారం కొత్త ఆధార్ నమోదు ఉచితం.
ఐదేళ్లు పూర్తయ్యాక బయోమెట్రిక్ అప్‌డేట్
ఇక పిల్లలకు ఐదేళ్లు పూర్తయ్యాక మాత్రం చాలా ముఖ్యమైన మార్పు ఉంటుంది. ఐదేళ్లు పూర్తయ్యాక పిల్లల బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేయాలి. అంటే ఫింగర్ ప్రింట్లు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
అందుకే తల్లిదండ్రులు ఒక విషయం గుర్తుంచుకోవాలి. పిల్లలకు ఐదేళ్లలోపు ఆధార్ తీసుకోవడం ఒకసారి, ఐదేళ్లు పూర్తయ్యాక బయోమెట్రిక్ అప్‌డేట్ చేయడం మరో ముఖ్యమైన దశ.
కాబట్టి మీ ఇంట్లో చిన్నారి ఉంటే బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్‌ను సిద్ధంగా పెట్టుకోండి. అధికారిక ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి బాల ఆధార్ నమోదు చేసుకోవచ్చు. చిన్నారి పుట్టిన వెంటనే ఆధార్ తీసుకోవచ్చు. అయితే ఐదేళ్లలోపు పిల్లలకు బయోమెట్రిక్స్ తీసుకోరనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి.
Also Read: జూరాలపై రాజకీయ వేడి.. గేట్లు ఎత్తిన రైతులు, KTR సంచలన వ్యాఖ్యలు


