ఆధార్ కార్డులో పేర్లు తప్పుగా ఉండడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్లి తర్వాత మహిళలు ఇంటి పేరు మార్చుకోలేకపోవడం, పేరులో ఇనిషియల్స్, మిడిల్ నేమ్ విషయంలో తప్పులు ఉండటం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో UIDAI పేరు మార్పులు, తప్పుల సవరణలకు సంబంధించి కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అమలులోకి తెచ్చింది. దీంతో పేరులో ఇనిషియల్స్ మార్చడం, మిడిల్ నేమ్ యాడ్ చేయడం, ఇంటి పేరు స్థానాన్ని మార్చడం వంటి మార్పులకు అవకాశం కల్పించింది.
చిన్నపాటి పేరు మార్పులకు అవకాశం
పేరులో చిన్నపాటి తప్పులు ఉన్నవాటిని UIDAI మైనర్ చేంజ్ కేటగిరీ కింద పరిగణిస్తోంది. ఉదాహరణకు పేరులో కేవలం ఇనిషియల్ ఉండి దాన్ని పూర్తి పేరుగా మార్చుకోవచ్చు. అలాగే కుమార్, రావు, ప్రసాద్ వంటి మిడిల్ నేమ్‌ను కొత్తగా జోడించడం లేదా ఇప్పటికే ఉన్న మిడిల్ నేమ్‌ను తొలగించడం కూడా చేసుకోవచ్చు.
ఇంటి పేరు వెనుక ఉంటే ముందుకు, ముందు ఉంటే వెనక్కు మార్చుకునే అవకాశం కూడా ఉంది. పేరు పలికే విధానం ఒకేలా ఉండి, టైపింగ్‌లో అక్షరాలు తప్పుగా నమోదు కావడం లేదా పేరు మధ్యలో ఉన్న డాట్స్‌ను తొలగించడం వంటి మార్పులను కూడా ఈ కేటగిరీ కింద చేసుకోవచ్చు.
ఏ డాక్యుమెంట్లు కావాలి?
పేరు సవరణ కోసం పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ వంటి సరైన గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి ఉంటే సరిపోతుంది.
డేటా ఎంట్రీలో తప్పులు ఉంటే..
ఆధార్ సెంటర్‌లో నమోదు చేసే సమయంలో ఒరిజినల్ సర్టిఫికేట్‌లో పేరు సరిగ్గానే ఉన్నప్పటికీ, కంప్యూటర్ ఆపరేటర్ తప్పుగా టైప్ చేసిన సందర్భాలను డేటా ఎంట్రీ తప్పులుగా పరిగణిస్తారు. ఇలాంటి తప్పులను సరిచేయడానికి అఫిడవిట్‌తో పాటు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
వివాహం తర్వాత మహిళలు పేరు మార్చుకోవచ్చు
పెళ్లి తర్వాత లేదా విడాకుల తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవడానికి కూడా UIDAI ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది. వివాహం తర్వాత భర్త ఇంటి పేరును మార్చుకోవాలనుకునే మహిళలు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా చట్టబద్ధమైన పత్రాలతో పాటు నిర్దేశిత అఫిడవిట్‌ను సమర్పించి ఆధార్‌లో పేరును అప్డేట్ చేసుకోవచ్చు.
పూర్తిగా కొత్త పేరు పెట్టుకోవాలంటే..
ఆధార్ కార్డులో ఉన్న పేరును పూర్తిగా మార్చి సరికొత్త పేరు పెట్టుకోవాలనుకుంటే దాన్ని మేజర్ నేమ్ చేంజ్‌గా పరిగణిస్తారు. దీనికి ప్రత్యేక ప్రక్రియ ఉంటుంది. ప్రభుత్వ గెజెట్ నోటిఫికేషన్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. గెజెట్‌లో పేరు మార్పు ప్రచురితమైన తర్వాత ఆధార్‌లో పూర్తి పేరును మార్చుకునే అవకాశం ఉంటుంది.
ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిందే
పేరు మార్పులకు సంబంధించిన ప్రక్రియను ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. అయితే తుది ప్రక్రియ కోసం సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేస్తారు.
ఈ సర్వీస్ కోసం ప్రభుత్వం రూ.50 ఫీజును నిర్ణయించింది. ఆధార్ కార్డులో పేరులో తప్పులు ఉన్నవారు సంబంధిత డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి పేరు సవరణ చేసుకోవచ్చు.


