కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య అధికారం కోసం పోటీ కొనసాగుతుండగా, ఇప్పుడు మంత్రి పదవుల అంశం కొత్త వివాదానికి దారితీసింది.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెంటనే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ, తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసేందుకు వారు ఢిల్లీకి బయలుదేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రి వర్గంలో చోటు కోసం..
ఢిల్లీకి వెళ్లే ముందు ఎమ్మెల్యే గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటికే పలుమార్లు సమావేశమయ్యాం. ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించేలా ఒత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపారు. కొందరు నేతలకు ఇప్పటికే పలుమార్లు అవకాశాలు లభించాయని, ఈసారి కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
ఇక మరో ఎమ్మెల్యే అశోక్ పట్టన్ మాట్లాడుతూ, “సమ్మిళిత నాయకత్వం కోసం ప్రయత్నిస్తున్నాం. వెంటనే మంత్రివర్గ విస్తరణ చేసి మాకు అవకాశం ఇవ్వాలి” అని డిమాండ్ చేశారు. రెండేళ్ల తర్వాత ఇతరులకు మంత్రి పదవులు ఇస్తామని సీఎం సిద్ధరామయ్య గతంలో హామీ ఇచ్చారని, ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని వాపోయారు.
25 స్థానాలు కేటాయించాలి..
ఈ క్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కీలక నేతలు కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలాలను కూడా కలిసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. తమ డిమాండ్‌లో ఎలాంటి విభేదం లేదని, తుది నిర్ణయం హైకమాండ్ తీసుకోవాల్సి ఉంటుందని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు.
ఇక తమకు మంత్రివర్గంలో సుమారు 25 స్థానాలు కేటాయించాలని ఎమ్మెల్యేలు కోరడం గమనార్హం. ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి ఇంకా కొనసాగుతోందనే సంకేతాలు ఇస్తున్నాయి.
మరోవైపు, ఎమ్మెల్యేల ఈ చర్యలపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి పదవుల కోసం పోటీ పడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులకు దారితీసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read:


