భార‌త్‌కి శుభ‌వార్త అందించిన ఇరాన్.. హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్

హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం వాణిజ్య, ఇంధన రంగాలకు ఊతం ఇవ్వనుంది. మిత్ర దేశాలకు మాత్రమే ఈ సడలింపు కల్పించడంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది.

Strait of Hormuz disruptions

అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చేసిన తాజా ప్రకటనతో భారత్‌కు కీలక ఊరట లభించింది. ఈ విషయాన్ని ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.

ఇరాన్ నిర్ణయం ప్రకారం, భారత్‌తో పాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ దేశాలకు చెందిన నౌకలకు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణానికి అనుమతి ఇవ్వనున్నారు. ఈ ఐదు దేశాలను తమ ఆప్త మిత్రులుగా గుర్తించిన ఇరాన్, తమకు వ్యతిరేకంగా ఉన్న అంతర్జాతీయ చర్యలకు మద్దతు ఇవ్వని దేశాలకు మాత్రమే ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది.

భార‌త నౌక‌ల‌కు ఉప‌శ‌మ‌నం

ఈ నిర్ణయం వల్ల గత కొంతకాలంగా నిలిచిపోయిన భారత నౌకలకు ఉపశమనం లభించింది. ముఖ్యంగా గ్యాస్ ట్యాంకర్లు, నిత్యావసర సరుకులతో ఉన్న భారీ నౌకలు అనుమతుల కోసం వేచి ఉండగా, ఇప్పుడు అవి సురక్షితంగా భారత తీరాలకు చేరుకునే అవకాశం ఏర్పడింది. దీని ద్వారా దేశంలో ఇంధన సరఫరా, వాణిజ్య కార్యకలాపాలకు ఊతం లభించనుంది.

టోల్ విధించ‌నున్నారా?

మరోవైపు, హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ప్రత్యేక రుసుము (‘టోల్’) విధించే అంశాన్ని కూడా ఇరాన్ పరిశీలిస్తోంది. ఇందుకోసం ఇరాన్ పార్లమెంట్ కొత్త చట్టాన్ని రూపొందిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ రుసుము వసూలు చేసినందుకు ప్రతిఫలంగా ఆయా నౌకలకు ఇరాన్ సైన్యం పూర్తి స్థాయి భద్రత కల్పించనుందని సమాచారం.

Also Read: 6 రోజుల్లోనే ₹900 కోట్లు… ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ దుమ్మురేపుతోంది

సముద్ర దొంగల ముప్పు, ఇతర భద్రతా సమస్యల నుంచి నౌకలను రక్షిస్తూ గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతను ఇరాన్ తీసుకోనుండటం విశేషం. మొత్తంగా ఈ పరిణామం అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »