బీహార్‌లో మారుతున్న స‌రికొత్త రాజ‌కీయం.. నితీష్ కుమార్ రాజీనామా, కొత్త ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి

సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి కీలక మలుపు తిరిగింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, ఎన్డీయే కూటమి నుంచి సామ్రాట్ చౌదరి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

Samrat Choudhary being elected as the leader of the BJP legislative party in Bihar in the presence of senior leaders.
Samrat Choudhary being elected as the leader of the BJP legislative party in Bihar in the presence of senior leaders.

భారత రాజకీయాల్లో ‘కింగ్ మేకర్’గా గుర్తింపు పొందిన నితీష్ కుమార్ సుదీర్ఘ పాలనకు కీలక మలుపు తిరిగింది. మంగళవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

ఇప్పటివరకు కీలక పాత్ర పోషించిన జేడీయూ మద్దతుతో, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్రంలో డ్రైవింగ్ సీట్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమి సామ్రాట్ చౌదరిను బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

రేపే ప్ర‌మాణ స్వీకారం..

బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సామ్రాట్ చౌదరి, త్వరలో అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పాట్నాలోని లోక్ భవన్‌లో ఏప్రిల్ 15న ప్రమాణ స్వీకారం జరగనున్నట్లు సమాచారం.

బీహార్‌లో బీజేపీ స్వతంత్రంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం ఇదే తొలిసారి కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించిన ఈ నిర్ణయానికి రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ వంటి నేతలు మద్దతు తెలిపారు.

ఘ‌నంగా వీడ్కోలు..

ఇక తన చివరి క్యాబినెట్ సమావేశంలో నితీష్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యారు. గత రెండు దశాబ్దాల్లో బీహార్ అభివృద్ధికి తాము చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, “రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకు సాగాలి” అని ఆకాంక్షించారు. మంత్రులు, అధికారులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

అయితే నితీష్ కుమార్ రాజకీయాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పడం లేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ జాతీయ రాజకీయాల్లో తన పాత్రను కొనసాగించనున్నారు.

కేబినేట్ కూర్పుపై చ‌ర్చ‌లు..

జేపీ ఉద్యమం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నితీష్ కుమార్, బీహార్ రాజకీయాల్లో ఒక కీలక నాయకుడిగా నిలిచారు. 2005 నుంచి ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు, విద్యుత్, శాంతిభద్రతలు, మహిళా సాధికారత వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి చోటుచేసుకుంది.

ఇప్పుడేమో సామ్రాట్ చౌదరి నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కొత్త దిశగా అడుగులు వేయబోతోంది. 243 స్థానాలున్న అసెంబ్లీలో మెజారిటీ ఉండటంతో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. కేబినెట్ కూర్పు, ఉప ముఖ్యమంత్రుల ఎంపికపై చర్చలు కొనసాగుతున్నాయి.

మొత్తానికి, నితీష్ కుమార్ వైదొలగడం బీహార్ రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగింపు కాగా, సామ్రాట్ చౌదరి నాయకత్వంలో కొత్త రాజకీయ ప్రయోగానికి నాంది పలికినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »