అంతర్జాతీయ క్రికెట్‌కు ‘సంకట్ మోచన్’ రహానే గుడ్‌బై: ఎందుకో తెలుసా?

భారత క్లాసిక్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలికారు. "Cap 278 signing off" అంటూ భావోద్వేగ సందేశంతో సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికి, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశారు.

Ajinkya Rahane Retirement
Ajinkya Rahane Retirement
  • అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అజింక్య రహానే.
  • జట్టును నడిపించిన తీరు, ‘సంకట్ మోచన్’గా రహానే సాధించిన అరుదైన విజయాలు.
  • భావోద్వేగానికి గురిచేసిన రహానే వీడ్కోలు సందేశం, సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ.

భారత క్రికెట్‌లో అత్యంత ప్రశాంతమైన, వినయపూర్వకమైన, అదే సమయంలో ఒత్తిడిలో కొండంత ధైర్యాన్ని ప్రదర్శించిన మిడిల్ ఆర్డర్ దిగ్గజం అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

“ప్రతీ ప్రయాణానికి ముగింపు ఉన్నట్టే.. నా ఆటకు కూడా వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది” అంటూ సోషల్ మీడియా ద్వారా భావోద్వేగపూర్వకంగా తన నిర్ణయాన్ని ప్రకటించారు. “Cap 278 signing off. ప్రతీ క్షణానికి కృతజ్ఞుడిని” అంటూ ఐకానిక్ రీతిలో సందేశాన్ని పంచుకున్నారు.

ఆయన వైదొలగడంతో భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విశ్వసనీయమైన, జట్టు ప్రయోజనాలే పరమావధిగా భావించిన ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది.

“దేశమే నన్ను నడిపించింది”: భావోద్వేగపూరిత వీడ్కోలు

రిటైర్మెంట్ సందర్భంగా రహానే మాట్లాడుతూ, “నా జీవితంలో ఒక్కటే సూత్రాన్ని నమ్మాను. ఎల్లప్పుడూ నా జట్టును, నా దేశాన్ని నా స్వార్థం కంటే ముందే ఉంచాను. పూర్తి నిజాయితీతో ఈ ఆటకు ప్రాతినిధ్యం వహించాను.

నీ ఆలోచన సరైనదైతే, ఆట ఎప్పుడూ నిన్ను ఆదుకుంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఒక ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా నా ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఈ 20 ఏళ్లలో భారత క్రికెట్ ఊహించని రీతిలో ఎదిగింది. ఆ అద్భుత ప్రయాణంలో భాగమైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను” అని తెలిపారు.

అలాగే తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ – ఏడేళ్ల వయసులో ముంబై లోకల్ రైళ్లలో ప్యాక్ అయిన బ్యాగ్‌తో ఒంటరిగా ప్రాక్టీస్‌కు వెళ్లిన రోజులను పంచుకున్నారు.

తండ్రి తన కోసం జీతం లేని సెలవు పెట్టి, తను సురక్షితంగా వెళ్తున్నాడో లేదో వెనకాలే మరో కంపార్ట్‌మెంట్‌లో గమనించే వారని తెలుసుకున్న ఆ క్షణమే తన జీవితంలో అతిపెద్ద ప్రేరణగా నిలిచిందని, అప్పటినుంచే దేశం కోసం సాధించాలనే పట్టుదల పెరిగిందని గుర్తుచేసుకున్నారు.

ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రాత్మక సిరీస్ విజయం: కెప్టెన్‌గా సరికొత్త చరిత్ర

అజింక్య రహానే పేరు చెప్పగానే ప్రతి భారతీయుడికి గుర్తొచ్చేది 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT). అడిలైడ్ టెస్టులో టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తరుణంలో, రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై భారత్‌కు తిరిగి వచ్చేశారు. ఎంతో మంది క్రికెట్ పండితులు భారత్ 0-4తో సిరీస్ కోల్పోతుందని తేల్చిజెప్పారు.

అయితే, ఒత్తిడిని కొండంత ధైర్యంతో ఎదుర్కొన్న రహానే జట్టును ముందుండి నడిపించారు.

మెల్‌బోర్న్ (MCG) టెస్టులో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో 112 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

షమీ, ఉమేష్, విహారి, ఐషాంత్, రవిచంద్రన్ అశ్విన్ వంటి కీలక ప్లేయర్లు గాయపడినా, యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ అద్భుత వ్యూహాలతో సిరీస్‌ను 2-1తో ముగించారు.

టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ కమ్‌బ్యాక్ విజయాల్లో ఒకటిగా ఈ సిరీస్ నిలిచిపోయింది. అంతకుముందు 2017 ధర్మశాల టెస్టులోనూ కోహ్లీ గాయపడినప్పుడు రహానే సారథ్యంలోనే భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.

 

View this post on Instagram

 

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane)

SENA దేశాల్లో విదేశీ గడ్డపై వీరుడు

అజింక్య రహానేని ఎల్లప్పుడూ SENA (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్‌గా భావిస్తారు. విదేశీ, కష్టమైన పిచ్‌లపై జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రహానే బ్యాట్ ఎప్పుడూ మాట్లాడేది.

ఆయన సాధించిన 12 టెస్టు సెంచరీలలో అత్యధికం విదేశీ గడ్డపైనే నమోదు కావడం విశేషం:

  • సౌతాఫ్రికా పై: 3 సెంచరీలు
  • ఆస్ట్రేలియా పై: 2 సెంచరీలు
  • న్యూజిలాండ్ పై: 2 సెంచరీలు
  • ఇంగ్లాండ్ పై: 2 సెంచరీలు (లార్డ్స్ సెంచరీతో సహా)
  • 85 టెస్టుల్లో 5,077 పరుగులు చేసి,

స్లిప్‌లో అత్యంత సురక్షితమైన ఫీల్డర్‌గా ఎన్నో కీలక క్యాచ్‌లు పట్టుకుని జట్టుకు అండగా నిలిచారు.

ప్రశాంతతకు నిదర్శనం: వీడ్కోలు సందేశాలు

38 ఏళ్ల రహానే ముంబై తరఫున డొమెస్టిక్ క్రికెట్‌లో మెరుపులు మెరిపిస్తూనే, ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు నాయకత్వం వహించారు.

రహానే నిష్క్రమణపై క్రికెట్ ప్రపంచం స్పందించింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజింక్య నాయక్ ఆయన సేవలను కొనియాడారు. అభిమానులు, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా ఆయన సుదీర్ఘ ప్రయాణాన్ని స్మరించుకుంటూ, “థాంక్యూ రహానే.. భారత క్రికెట్ ఎప్పటికీ నీ సేవలను గుర్తుంచుకుంటుంది” అని నివాళులర్పించారు.

మచ్చలేని కెరీర్, నిశ్శబ్దపోరాటం, నిబద్ధతలకు రహానే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు!

Also Read: ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపుల కేసు.. అరెస్టుతో వెలుగులోకి షాకింగ్ వివరాలు

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »