Telangana Rice Millers Strike: తెలంగాణ రైస్ మిల్లర్లకు, ప్రభుత్వానికి మధ్య వివాదం ముదురుతోంది. బాయిల్డ్ రైస్ తీసుకోవాలని మిల్లర్లు పట్టుపడుతుండగా.. రా రైస్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం కోరిన విధంగా రా రైస్ ఇచ్చే ప్రసక్తే లేదని మిల్లర్లు తేల్చి చెబుతున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బకాయిలను చెల్లిస్తేనే ధాన్యం సీఎంఆర్ బియ్యాన్ని అప్పగిస్తామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైస్ మిల్లులు మూతపడ్డాయి. మిల్లులకు తాళాలు వేసిన యజమానులు భారీ సంఖ్యలో కలెక్టరేట్‌కు తరలివచ్చి ధర్నాకు దిగారు. సీఎంఆర్ విధానంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మార్చాలని డిమాండ్ చేశారు.
బాయిల్డ్ రైస్, రా రైస్‌పై ప్రధాన వివాదం
రాష్ట్రంలో అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్న జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు పేరుంది. ప్రస్తుతం ఈ జిల్లాలోని రైస్ మిల్లర్లు సమ్మెబాట పట్టారు. రబీ సీజన్‌లో బాయిల్డ్ రైస్‌ను మాత్రమే సీఎంఆర్ కింద తీసుకోవాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం రా రైస్ ఇవ్వాలని కోరుతోందని, రబీ ధాన్యంతో బాయిల్డ్ రైస్ మాత్రమే సాధ్యమవుతుందని మిల్లర్లు చెబుతున్నారు.
బాయిల్డ్ రైస్‌ను తరలించేందుకు అవసరమైన రేకులను కేటాయించాలని వారు కోరుతున్నారు. రవాణా సౌకర్యాలు సక్రమంగా లేకపోవడం వల్ల సీఎంఆర్ డెలివరీలో జాప్యం జరుగుతోందని తెలిపారు. ప్రతి క్రాప్ సీజన్‌లో తమకు రావాల్సిన మొత్తాలను ప్రభుత్వం సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్
ధాన్యం కొనుగోలు సమయంలోనే టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి, దాని ఆధారంగా సీఎంఆర్ శాతాన్ని నిర్ణయించాలని మిల్లర్లు కోరుతున్నారు. మిల్లింగ్ ప్రక్రియలో డామేజ్, రంగు మారిన బియ్యం, నూకలు, పరము వంటి వాటి కారణంగా 15 నుంచి 25 శాతం వరకు షార్టేజ్ వస్తుందని, దానిని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు.
మిల్లర్లకు రావాల్సిన బిల్లులను లెక్కలు తేల్చి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమపై విధించిన మొత్తాలను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తమకు రావాల్సిన బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించాలని అన్నారు.
ఫిజికల్ వెరిఫికేషన్‌పై అభ్యంతరం Telangana Rice Millers Strike
విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల పేరుతో మిల్లర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. బకాయిలు లేని మిల్లులపై కూడా ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు.
తనిఖీల కారణంగా మిల్లర్లపై అనవసరమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, మిల్లర్లందరినీ తప్పు చేసినవారిగా చూడవద్దని కోరారు. ఫిజికల్ వెరిఫికేషన్‌ను నిలిపివేసి, మిల్లర్లను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
పాత ఖాళీ బస్తాలపైనా డిమాండ్లు Telangana Rice Millers Strike
ఏళ్ల తరబడి తమ వద్ద ఉన్న పాత ఖాళీ బస్తాలను ప్రభుత్వం తిరిగి తీసుకోవాలని మిల్లర్లు కోరుతున్నారు. లేదంటే ఒక్కో బస్తాకు రూ.10 ధర నిర్ణయించాలని సూచించారు. 200 హెచ్‌పీ వరకు ఉన్న విద్యుత్ కనెక్షన్లను ఐటీ కేటగిరీలోనే కొనసాగించాలని, టెండర్ ధాన్యానికి సంబంధించిన మార్కెట్ ఫీజు విషయంలో లైసెన్సుల రెన్యూవల్‌కు అవకాశం కల్పించాలని కోరారు.
ధాన్యాన్ని తమ ముందే మిల్లింగ్ చేసి, డ్రైయింగ్ అనంతరం ఎఫ్‌సీఐకి డెలివరీ చేస్తామని మిల్లర్లు తెలిపారు. మిల్లింగ్ అనంతరం వచ్చే రిజెక్షన్, బ్రోకెన్ రైస్, నాణ్యత వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే మిల్లర్లతో మాట్లాడాలని సూచించారు.
ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
దాదాపు 15 రోజులుగా మిల్లింగ్ పరిశ్రమ పూర్తిగా బంద్‌లో ఉందని మిల్లర్లు తెలిపారు. మరికొంతమంది మిల్లర్లు దాదాపు 45 రోజులుగా మిల్లులకు తాళాలు వేసి తమ వద్ద ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నా స్పందన లేదని అన్నారు.
ప్రభుత్వం, మిల్లర్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు వెంటనే పరిష్కారం చూపాలని, రైస్ సేకరణ, మిల్లింగ్, రవాణా ప్రక్రియను సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైస్ మిల్లర్లు హెచ్చరించారు.


