ఘోరంగా నిరాశ‌ప‌రిచిన హోస్ట్ టీమ్.. కోచ్ పదవికి జయసూర్య గుడ్‌బై?.. పాక్ మ్యాచ్ అనంతరం కీలక ప్రకటన

టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక జట్టు సూపర్-8 దశలోనే నిష్క్రమించడంతో హెడ్ కోచ్ స‌న‌త్ జ‌య‌సూర్య తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని వె

Sanath Jayasuriya

శ్రీలంక క్రికెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2026 నుంచి లంక జట్టు నిష్క్రమించగానే హెడ్ కోచ్ సనత్ జయసూర్య తన పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. శనివారం పల్లెకెలె వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ 2026 తన చివరి అసైన్‌మెంట్‌ అని జయసూర్య ముందుగానే వెల్లడించారు. ఇంగ్లాండ్ సిరీస్ సమయంలోనే తాను ఎక్కువకాలం హెడ్ కోచ్‌గా కొనసాగనని సంకేతాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రపంచకప్‌లో జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఉంటే మంచి ముగింపు ఇవ్వాలనుకున్నానని, కానీ అలా జరగలేదని తెలిపారు.

సూపర్-8లో వరుస ఓటములు

గ్రూప్ దశలో శ్రీలంక జట్టు మెరుగైన ఆటతీరుతో ప్రశంసలు అందుకుంది. అయితే సూపర్-8 దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలై టోర్నీ నుంచి త‌ప్పుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందుగానే టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన లంక జట్టు చివరి మ్యాచ్‌లో అయిన గెలిచి గౌరవప్రదంగా ముగించాలని ప్రయత్నించింది. కాని అలా జ‌ర‌గ‌లేదు.

Also Read: క్యాన్స‌ర్‌తో పోరాడి ఓడిన రింకూ సింగ్‌ తండ్రి.. శోక సంద్రంలో కుటుంబం

శనివారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో సాహిబ్జాదా ఫర్హాన్ శతకం (100; 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సాధించగా, ఫఖర్ జమాన్ (84; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు, దాసున్ శనక రెండు, చమీర ఒక వికెట్ తీశారు.

లక్ష్య ఛేదనలో పోరాడిన లంక

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ దాస‌న్ శ‌న‌క‌ 76 నాటౌట్ (31 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్లు)తో వీరోచితంగా పోరాడగా, పవన్ రత్నాయక్ 58 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు.

మ్యాచ్ అనంతరం జయసూర్య మాట్లాడుతూ తాను హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నానని చెప్పారు. “వేరొకరికి బాధ్యతలు అప్పగించే సమయం వచ్చిందని అనిపిస్తోంది. నా ఒప్పందం జూన్ వరకు ఉంది. ఈ విషయాన్ని ఇంకా శ్రీలంక క్రికెట్ బోర్డుకు అధికారికంగా తెలియజేయలేదు. ముందుగా వారితో చర్చించాలి,” అని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత శ్రీలంక క్రికెట్‌లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. జయసూర్య నిర్ణయం అధికారికమైతే, లంక జట్టుకు కొత్త కోచ్ నియామకం కీలకంగా మారనుంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »