క్యాన్స‌ర్‌తో పోరాడి ఓడిన రింకూ సింగ్‌ తండ్రి.. శోక సంద్రంలో కుటుంబం

టీమిండియా యువ స్టార్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ఆయన మృతితో రింకూ సింగ్ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు.

Rinku Singh father death
Rinku Singh father death

టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ (Khachandra Singh) గురువారం గ్రేటర్ నోయిడాలోని యథర్త్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన నాలుగో దశ కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు నిలబెట్టలేకపోయారు. దీంతో రింకూ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రింకూకి ప‌లువురు క్రికెట‌ర్స్, స‌న్నిహితులు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నారు. అయితే తండ్రి ఆరోగ్యం విషమించిందని సమాచారం అందుకున్న రింకూ సింగ్ మూడు రోజుల క్రితమే తన స్వగ్రామానికి వెళ్లాడు. కుటుంబంతో కొంత సమయం గడిపిన తర్వాత మళ్లీ భారత జట్టుతో చేరాడు. అయితే గురువారం జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో ఆయనకు చోటు దక్కలేదు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజూ శాంసన్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేయడంతో రింకూ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

నిరుపేద కుటుంబం నుంచి స్టార్‌డమ్ వరకు

ఇక వెస్టిండీస్‌తో జరగనున్న తదుపరి మ్యాచ్‌కు కూడా రింకూ దూరమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తండ్రి మృతివార్త అందుకున్న వెంటనే ఆయన హుటాహుటిన సొంతూరుకు బయలుదేరాడు. రింకూ సింగ్ జీవితం ఎంతో ప్రేరణాత్మకం. అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన కష్టపడి క్రికెట్‌లో ఎదిగాడు. ఆయన తండ్రి గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే ఉద్యోగం చేసేవారు. కొడుకు స్టార్ క్రికెటర్‌గా ఎదిగినా తన పని మాత్రం కొనసాగించడం ఆయన సరళ స్వభావానికి నిదర్శనం.

ఐపీఎల్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తరఫున అద్భుత ప్రదర్శనతో రింకూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో సంచలన ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌లను మలుపుతిప్పడంతో అతనికి ప్రత్యేక స్థానం ఏర్పడింది.

తండ్రిపై అపారమైన ప్రేమ

రింకూ సింగ్‌కు తన తండ్రి అంటే ఎంతో మమకారం. కెరీర్ ప్రారంభ దశలోనే తన తండ్రికి ఇష్టమైన స్పోర్ట్స్ బైక్‌ను బహుమతిగా ఇచ్చి ఆనందపరిచాడు. పలు సందర్భాల్లో తండ్రి తనకు చేసిన త్యాగాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఇటీవల రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా స‌రోజ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే అంతర్జాతీయ మ్యాచ్‌లు, టోర్నమెంట్లతో బిజీగా ఉండటంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు. దురదృష్టవశాత్తు కొడుకు పెళ్లి చూడకుండానే ఖచంద్ర సింగ్ కన్నుమూశారు.

ఈ విషాద సమయంలో రింకూ సింగ్‌కు సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సానుభూతి తెలియజేస్తున్నారు. క్రికెట్ ప్రపంచం మొత్తం ఆయన కుటుంబానికి ధైర్యం చెబుతోంది. తండ్రి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని పలుమార్లు చెప్పిన రింకూ సింగ్‌కు ఇది తీరని లోటే. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబానికి బలం చేకూరాలని అభిమానులు కోరుకుంటున్నారు.

About Author:

Ch Roja Rani

గత 5 సంవత్సరాలుగా తెలుగు మీడియా రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న జర్నలిస్ట్‌. డిజిటల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అయిన Idreampost మరియు Wire Teluguలో పని చేసి విశేష అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం Mana Varta లో క్రీడలు (Sports…

More About Author »