- కడియం శ్రీహరికి స్పీకర్ నోటీసులు జారీ — నేడు కీలక విచారణ
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ తుది నిర్ణయం ఆసక్తికరం
- సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో కేసుకు మరింత ప్రాధాన్యం
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు స్పీకర్ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఈ విచారణ జరగనుంది. అదే సమయంలో పిటిషనర్ అయిన వివేకానందకు కూడా స్పీకర్ నోటీసులు పంపించారు.
గత కొంతకాలంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులను విడివిడిగా విచారిస్తున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, నేడు కడియం శ్రీహరి వర్సెస్ వివేకానంద వ్యవహారాన్ని పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా కడియం తరఫు న్యాయవాదులు వివేకానందను క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశముంది. ఈ విచారణ అనంతరం స్పీకర్ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మెగా అభిమానులకు పండగ… ‘పెద్ది’ రిలీజ్ డేట్ ప్రకటించిన చిత్రబృందం
తుది నిర్ణయం..
ఇటీవలే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 8 మందిపై వచ్చిన అనర్హత పిటిషన్లను
స్పీకర్ కొట్టివేసిన విషయం తెలిసిందే.
వారిపై పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలు లేవన్న స్పీకర్
ఇంకా వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు వెల్లడించిన స్పీకర్.
దానం నాగేందర్‌పై విచారణ జరిగినప్పటికీ ఆయనపై నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.
దానం మాత్రం తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ప్రకటించడం గమనార్హం.
కడియం శ్రీహరి విచారణ అనంతరం దానం నాగేందర్, కడియం పై స్పీకర్ తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.
స్పీకర్‌కి ఫిర్యాదు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య తదితరులు 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు స్పీకర్‌కు ఫిర్యాదు చేసి అనర్హత విధించాలని కోరారు. అయితే నిర్ణయం ఆలస్యమవుతుండటంతో బీఆర్ఎస్ నేతలు హైకోర్టు, అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ ఆలస్యం చేయడాన్ని తప్పుబడుతూ, అవసరమైతే తామే చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకుని సమావేశాలకు హాజరవడం, ప్రచారాల్లో పాల్గొనడం వంటి విషయాలను బీఆర్ఎస్ ప్రస్తావిస్తోంది. అయినప్పటికీ వారు ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నారని స్పీకర్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
కీలక అంశాలు:
కడియం తరఫు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం
ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
దానం నాగేందర్‌పై నిర్ణయం ఇంకా పెండింగ్
సుప్రీంకోర్టు స్పీకర్ ఆలస్యంపై తీవ్ర వ్యాఖ్యలు
పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం
మొత్తం మీద కడియం శ్రీహరి విచారణ తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉన్న పరిణామంగా భావిస్తున్నారు. స్పీకర్ తీసుకునే తుది నిర్ణయం భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.