TG Cabinet | తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణతో పాటు శాఖల పునర్విభజనకు కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరో వారం నుంచి పది రోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ, ప్రభుత్వ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. కేవలం ఖాళీల భర్తీతో సరిపెట్టకుండా, మంత్రివర్గంలో సమగ్ర ప్రక్షాళన చేపట్టాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు మంత్రుల పనితీరు, ప్రజల్లో వారి పట్ల ఏర్పడిన అభిప్రాయం, శాఖల నిర్వహణ తీరును సమీక్షించిన అనంతరం మార్పులు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకటి రెండు కీలక మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్ల కాలంలో చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నికల దిశగా ప్రభుత్వం మరింత దూకుడుగా ముందుకెళ్లాలంటే పరిపాలనలో వేగం పెరగాల్సిన అవసరం ఉందని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద సమగ్ర నివేదికలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. ఇదే నివేదికలు ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదిక కానున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుదనం చూపని వారు, శాఖల నిర్వహణలో ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిన వారిపై చర్యలు ఉండొచ్చని పార్టీ నేతలు చెబుతున్నారు.
పలువురికి ఉద్వాసన.. కొత్త ముఖాలకు చోటు
ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న కొందరిని తప్పించి వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అంశాన్ని కూడా అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గుజరాత్, గోవా, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఒక కీలక మంత్రికి స్పీకర్ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీలో పదవుల మార్పులపై ఆసక్తికర చర్చ సాగుతోంది. కేవలం కొత్త మంత్రుల నియామకమే కాకుండా శాఖల కేటాయింపులోనూ గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని కీలక శాఖలను సమర్థులైన మంత్రులకు అప్పగించడం ద్వారా పాలనలో మరింత వేగం తీసుకురావాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్దనే ఉన్న విద్యాశాఖను ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాయకుడికి అప్పగించే అవకాశాలపై కూడా ప్రచారం జరుగుతోంది.
ఆశావహుల లాబీయింగ్
మంత్రివర్గంలో చోటు కోసం పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులతో పాటు మరికొన్ని స్థానాలు అందుబాటులోకి రావచ్చన్న ప్రచారం నేపథ్యంలో ఆశావహులు ఢిల్లీలో మకాం వేసి పార్టీ అగ్రనేతలను కలుస్తున్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కీలక నేతలతో సమావేశమై తమ వాదనలు వినిపిస్తున్నట్లు సమాచారం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంతో పాటు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవస్థలోనూ కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ త్వరలో జాతీయ రాజకీయాల్లో మరింత బిజీ కానుండడంతో ఆమె స్థానంలో కొత్త ఇన్‌ఛార్జిని నియమించే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో మీనాక్షి నటరాజన్‌కు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశముండటంతో తెలంగాణపై పూర్తి స్థాయిలో దృష్టి సారించే నేతను నియమించాలన్న ఆలోచన పార్టీ పెద్దల్లో ఉన్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నికల జట్టుగా కొత్త కేబినెట్
వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని, పార్టీని ఒకే దిశగా నడిపించే బలమైన బృందాన్ని రూపొందించాలన్న లక్ష్యంతోనే ఈ మార్పులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈసారి జరిగేది సాధారణ కేబినెట్ విస్తరణ కాకుండా ఎన్నికల ముందస్తు వ్యూహంలో భాగమైన రాజకీయ పునర్వ్యవస్థీకరణగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా వచ్చే కొద్ది రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో అధికార కాంగ్రెస్‌లో ఉత్కంఠ నెలకొంది. ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది? ఎవరిపై వేటు పడుతుంది? శాఖల మార్పులు ఎలా ఉంటాయి? అన్న ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరికే అవకాశం ఉంది.


