TRS Party | మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేనకు ప్రారంభంలో ఆటంకాలను ఎదుర్కొంటున్నది. పార్టీ పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం లభించే అవకాశాలు సన్నగిల్లాయి. ప్రస్తుతం ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ‘టీఆర్ఎస్’ అనే అనే షాట్ నేమ్‌ను కొత్త పార్టీకి కేటాయించొద్దని కేంద్ర ఎన్నికల సంఘానికి అభ్యంతరాలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రధానంగా భారత రాష్ట్ర సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమానికి ‘టీఆర్ఎస్’ పేరు ప్రతీకగా నిలిచిందని, ఆ పేరుతో ప్రజల్లో తమకున్న గుర్తింపును మరో పార్టీ వినియోగించుకోవడం సమంజసం కాదని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్‌ను పాత పేరైన ‘టీఆర్ఎస్’గానే పిలుస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో అదే పేరును మరో రాజకీయ పార్టీకి కేటాయించడం గందరగోళానికి దారితీస్తుందని పేర్కొంది.
అంతేకాకుండా, కవిత పార్టీ ప్రకటన వెలువడకముందే మహారాష్ట్రలోని సోలాపూర్‌కు చెందిన ఒక సంస్థ కూడా ‘టీఆర్ఎస్’ పేరుపై హక్కు కోరినట్లు సమాచారం. ‘తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన’ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ సంస్థ తరఫున దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు సమర్పించినట్లు తెలుస్తోంది. దీంతో ఒకే షాట్‌నేమ్‌పై పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. మరోవైపు, కవిత పత్రికల్లో విడుదల చేసిన పార్టీ ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున ప్రజా అభ్యంతరాలు కూడా ఎన్నికల సంఘానికి చేరినట్లు సమాచారం. సుమారు 600 నుంచి 700 వరకు అభ్యంతర పత్రాలు అందినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద ఇప్పటికే నమోదై ఉన్న ‘తెలంగాణ రాజ్య సమితి’ అనే పార్టీ కూడా ‘టీఆర్ఎస్’ అనే పేరును కొత్త పార్టీకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ తన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత తరఫు ప్రతినిధులు త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి తమ వాదనలు వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే పేరుపై పలువురు హక్కు కోరుతున్న పరిస్థితుల్లో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ‘తెలంగాణ రక్షణ సేన’కు ‘టీఆర్ఎస్’ గుర్తింపు దక్కుతుందా? లేక కొత్త పేరును వెతుక్కోవాల్సి వస్తుందా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏప్రిల్‌లో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో నిజామాబాద్ వేదికగా పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఆ పార్టీని తెలంగాణ రక్షణ సేనగా మారుస్తున్నట్లు ప్రకటించారు. మలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు సాధించడంతో పాటు, సామాజిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ఈ పార్టీని స్థాపించినట్లు కవిత ఆ సమయంలో ప్రకటించారు. తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, మహిళల సాధికారత, యువతకు రాజకీయ ప్రాధాన్యం కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యాలని కవిత పేర్కొన్నారు.


