హైదరాబాద్: బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లను అర్హులైన బీసీ మహిళలకు అందించనున్నారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12 వేలు కాగా.. లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు.
1.19 లక్షల మహిళలకు ప్రయోజనం
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
బీసీ మహిళలు ఇంటి నుంచే కుట్టు వృత్తిని చేపట్టి ఆదాయం పొందేలా చేయడమే పథకం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా.. స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు
ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించనున్నారు. భవిష్యత్‌లో పథకాన్ని మరింత విస్తరించి ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
వీరికి ప్రాధాన్యం
కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు పథకంలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముఖ్యంగా అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు మంత్రి తెలిపారు.
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని స్పష్టం చేశారు. కుట్టు మిషన్లను సక్రమంగా వినియోగించుకునేందుకు అవసరమైన శిక్షణను కూడా అందించనున్నట్లు తెలిపారు.
ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వివిధ స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం అవకాశాలు కల్పిస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అదే విధంగా ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా మహిళలు ఇంటి నుంచే కుట్టు పనులు చేసుకుంటూ ఆదాయం పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.
బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయించి నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ
ఈ నెల 14న సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి తెలిపారు.
అలాగే ఈ నెల 18న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.


