హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. గాంధీ ఆస్పత్రిలో ముగ్గురు అనుమానితులు..!

హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ (Ebola Virus) కలకలం సృష్టించింది. గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) ఐసోలేషన్ వార్డులో ముగ్గురు ల‌క్ష‌ణాల‌తో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టికే ఓ వ్య‌క్తి గాంధీలో చేర‌గా.. తాజాగా ఒకే విమానంలో వ‌చ్చిన ఇద్ద‌రిలో ల‌క్ష‌ణాలు క‌నిపించాయి. దాంతో వైద్యారోగ్య‌శాఖ అప్ర‌త్త‌మైంది. బాధితుల న‌మూనాల‌ను సేక‌రించి పుణేలోని ఎన్ఐవీకి పంపింది.

Ebola Scare in Hyderabad: Suspected Cases Under Observation at Gandhi Hospital

Ebola | ఆఫ్రికాలో హ‌డ‌లెత్తిస్తున్న ఎబోలా వైర‌స్ హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం సృష్టించింది. ఎబోలా ల‌క్ష‌ణాల‌తో ఇద్ద‌రు గాంధీ ఆసుప‌త్రిలో చేరారు. దాంతో రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ అప్రమత్తమైంది. దీంతో ప్రస్తుతం ఎబోలా అనుమానితులుగా గాంధీ ఆస్పత్రి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారి సంఖ్య ముగ్గురికి చేరింది. అధికారుల సమాచారం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు జ్వరం, తీవ్రమైన నీరసం, శరీర నొప్పులు వంటి లక్షణాలతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిని ఆశ్రయించారు. వారి ట్రావెలింగ్ హిస్ట‌రీ, ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఎబోలా అనుమానంతో వారిని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే లక్షణాలతో ఓ వ్యక్తి అక్కడ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

ఒకే విమానంలో ప్రయాణం..

ప్రాథమిక విచారణలో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు విదేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఒకే విమానంలో ప్రయాణించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఆ విమానంలో ప్రయాణించిన ఇతర ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమ‌గ్న‌మ‌య్యారు. ఎవరికైనా జ్వరం, వాంతులు, నీరసం లేదా ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపించాయా అని ఆరా తీస్తున్నారు. అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను కూడా విస్తరించే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.

నమూనాలు పుణెకు..

గాంధీ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ విభాగంలో ముగ్గురు అనుమానితులను ఉంచి వైద్యులు నిరంతర పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. వారి రక్త నమూనాలను సేకరించి తుది నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే వారికి నిజంగా ఎబోలా వైరస్ సోకిందా లేదా అన్నది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో ఒక సూడాన్ దేశ పౌరుడిని కూడా ఎబోలా అనుమానంతో ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్న వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

ఎబోలా అంటే?

ఎబోలా వైరస్ వ్యాధి (Ebola Virus Disease) అత్యంత ప్రమాదకరమైన వైరల్ ఇన్ఫెక్షన్ . దీన్ని మొదటగా 1976లో మధ్య ఆఫ్రికాలోని కాంగో (అప్పటి జైర్) ప్రాంతంలో గుర్తించారు. కాంగోలోని ఎబోలా నది సమీపంలో తొలి కేసులు నమోదవడంతో ఈ వైరస్‌కు ‘ఎబోలా’ అనే పేరు వచ్చింది. ఈ వైరస్ ప్రధానంగా అడవి జంతువుల నుంచి మనుషులకు వ్యాపించినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అనంతరం బాధితుల రక్తం, శరీర ద్రవాలు, కలుషిత వస్తువుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఎబోలా సోకిన వారిలో ప్రారంభ దశలో సాధారణ వైరల్ జ్వరంలాంటి లక్షణాలే కనిపిస్తాయి. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, తీవ్ర నీరసం, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, కొన్ని సందర్భాల్లో ముక్కు, చిగుళ్లు, అంతర్గత రక్తస్రావమ‌వుతుంది. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల్లో జ్వరంతో పాటు ఏవైనా అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాల‌ని వైద్యారోగ్య‌శాఖ సూచించింది. ల‌క్ష‌ణాలున్న వారితో ప్రత్యక్ష శారీరక సంబంధాన్ని త‌గ్గించాల‌ని, చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి. అలాగే, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు స్వీయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించాలి. ఎబోలా వంటి అంటువ్యాధుల నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిని తెలంగాణలో నోడల్ సెంటర్‌గా గుర్తించారు. ప్రత్యేక ఐసోలేషన్ గదులు, క్వారంటైన్ బెడ్లు, శిక్షణ పొందిన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. శంషాబాద్ విమానాశ్రయంలో కూడా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక స్క్రీనింగ్ కొనసాగుతోంది. అయితే, ఇప్పటివరకు హైదరాబాద్‌లో ఎబోలా కేసు అధికారికంగా నిర్ధారణ కాలేదని వైద్యశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న వారి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే అసలు పరిస్థితిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రజలు అనవసర ఆందోళనకు గురికావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read Also : శ్రీశైలం ఘాట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌.. వన్యప్రాణులపై వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌తో అధ్యయనం..

నైరుతి రుతుపవనాలపై అనిశ్చితి.. తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించేది ఎప్పుడో..?

 

 

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »