తెలంగాణలో గత భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఫార్ములా ఈ–కారు రేసు కేసు మరోసారి చర్చనీయాంశమైంది. ఇప్పటికే రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు దుమారం రేపుతుండగా, ఇప్పుడు ఫార్ములా ఈ–కారు వ్యవహారానికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు ఈ వారంలోనే కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ని ఏ1గా పేర్కొంటూ నేరాభియోగ పత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Also Read: మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎగిరి గంతేసే వార్త.. ఎన్ఎంసీ కీలక మార్పులతో డాక్టర్ అయ్యే అవకాశం
దర్యాప్తు దాదాపు పూర్తి..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు దాదాపు పూర్తయిందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. చార్జిషీట్‌కు ఇప్పటికే తుదిరూపం ఇచ్చిన ఏసీబీ అధికారులు, ఇందులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోసం కేంద్ర సిబ్బంది విభాగం అనుమతిని ఎదురుచూశారు. తాజాగా Department of Personnel and Training (డీవోపీటీ) నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి లభించడంతో ఆ విషయాన్ని ప్రభుత్వం ఏసీబీకి తెలియజేసింది. దీంతో చార్జిషీట్ దాఖలుకు అవసరమైన పత్రాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
ఫార్ములా ఈ–కారు రేసు నిర్వహణ కారణంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)కు సుమారు రూ.75.88 కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ తన దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. దీనిని రుజువు చేసే పలు ఆర్థిక లావాదేవీల వివరాలు, ఒప్పంద పత్రాలు, డిజిటల్ ఆధారాలను చార్జిషీట్‌లో పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ అరెస్ట్ జరుగుతుందా?
అదేవిధంగా ఫార్ములా ఈ–ఆపరేషన్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఏస్ నెక్స్ట్‌జెన్ కంపెనీకి కారు రేసు బాధ్యతలు అప్పగించడం, దానికి ప్రతిఫలంగా ఆ సంస్థ నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి రూ.45 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు రావడం ‘క్విడ్ ప్రో కో’లో భాగమని ఏసీబీ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గత ఏడాది నవంబర్‌లో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా వేరుగా కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే అర్వింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, కేటీఆర్‌లను ఏసీబీ, ఈడీ అధికారులు ఒక్కసారి విచారించారు. చార్జిషీట్‌లో నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర, ఇతరులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారనే అభియోగాలను పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.
చార్జిషీట్ దాఖలయ్యాక తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ అరెస్టు జరుగుతుందా? లేక మరింత విచారణ కొనసాగుతుందా? అన్నది న్యాయపరమైన ప్రక్రియల అనంతరం స్పష్టత రానుంది. రాజకీయంగా కూడా ఈ కేసు తెలంగాణలో వేడి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.