మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎగిరి గంతేసే వార్త‌.. ఎన్ఎంసీ కీల‌క మార్పుల‌తో డాక్ట‌ర్ అయ్యే అవ‌కాశం

మెడికల్ రంగంలో కెరీర్ ప్లాన్ చేసుకున్న‌ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇక బయాలజీ లేకపోయినా డాక్టర్ అవ్వొచ్చు. 12వ తరగతిలో మ్యాథ్స్ చదివిన విద్యార్థులు అదనపు సబ్జెక్టుగా బయాలజీ పాస్ అయితే మెడికల్ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హత పొందేలా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

Students preparing for NEET UG exam after NMC allows PCM students to apply

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ రంగంలో కెరీర్ నిర్మించుకోవాలని కలలు కంటుంటారు. ఇప్పటి వరకు డాక్టర్ కావాలంటే 11, 12వ తరగతుల్లో తప్పనిసరిగా బయాలజీ తీసుకోవాలనే నిబంధన ఉండేది.

మ్యాథ్స్ (PCM) స్ట్రీమ్ ఎంచుకున్న విద్యార్థులకు మెడికల్ రంగంలోకి వెళ్లే అవకాశం దాదాపు మూసుకుపోయినట్టే భావించేవారు. ఈ పరిస్థితి కారణంగా చాలామంది విద్యార్థులు ఒత్తిడితో బయాలజీని ఎంచుకోవడం లేదా తర్వాత స్ట్రీమ్ మార్చుకోవాల్సి రావడం వంటి సమస్యలు ఎదుర్కొనేవారు. అయితే ఇప్పుడు ఈ పరిస్థితికి గుడ్‌బై చెప్పేలా National Medical Commission కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read: ఫిబ్రవరి 26న పెళ్లా? విజయ్ దేవరకొండ–రష్మిక వివాహ ఆహ్వానం వైరల్… నిజమెంత?

అద‌న‌పు ప‌రీక్ష‌తో..

NEET UG 2026 అర్హత నిబంధనల్లో భాగంగా ఎన్‌ఎంసీ పెద్ద మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, 12వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ (PCM) చదివిన విద్యార్థులు కూడా డాక్టర్ అవ్వే దిశగా అడుగులు వేయవచ్చు. బయాలజీ లేదా బయోటెక్నాలజీని అదనపు (Additional) సబ్జెక్టుగా ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు ద్వారా పాస్ అయితే మెడికల్ ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హత లభిస్తుంది. అంటే ఇప్పుడు మళ్లీ రెండు సంవత్సరాలు బయాలజీతో ఇంటర్ చదవాల్సిన అవసరం లేకుండా ఒక అదనపు పరీక్షతోనే మెడికల్ మార్గం ఓపెన్ అవుతోంది.

మెడికల్ కోర్సుల్లో ప్రవేశం కోసం నీట్-యూజీ పాస్ అవ్వడం తప్పనిసరి. ఈ కొత్త మార్పు వల్ల ఇంజనీరింగ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా అవసరమైతే మెడికల్ వైపు మళ్లే అవకాశం పొందుతున్నారు. పరీక్షలో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులు భారత్‌తో పాటు విదేశాల్లోని మెడికల్ కాలేజీల్లో MBBS, BDS వంటి కోర్సుల్లో చేరవచ్చు. దీంతో విద్యార్థులకు కెరీర్ ఎంపికల్లో మరింత స్వేచ్ఛ లభిస్తోంది.

అర్హ‌త నిబంధ‌న‌లు య‌థావిధిగా..

ఇక స్ట్రీమ్ మార్పు కూడా సులభమైంది. 10వ తరగతి తర్వాత సరైన సమాచారం లేకపోవడం లేదా కుటుంబ ఒత్తిడితో PCM ఎంచుకున్న విద్యార్థులు గతంలో మళ్లీ 11, 12 తరగతులు బయాలజీతో చదవాల్సి వచ్చేది. దీంతో ఒకటి రెండు సంవత్సరాల సమయం వృథా అయ్యేది. ఇప్పుడు కేవలం అదనపు సబ్జెక్టుగా బయాలజీ పాస్ అయితే సరిపోవడం వల్ల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతున్నాయి. అయితే ఇతర అర్హత నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి. ఉదాహరణకు, ప్రవేశం పొందే ఏడాది డిసెంబర్ 31 నాటికి విద్యార్థి కనీసం 17 ఏళ్ల వయస్సు నిండాలి.

మార్కుల పరంగా కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. జనరల్ కేటగిరీ విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. OBC, SC, ST వర్గాలకు 40 శాతం, దివ్యాంగులకు (PwD) 45 శాతం మార్కులు అవసరం. బయాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకున్న విద్యార్థుల మార్కులు కూడా అర్హత లెక్కల్లో పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తంగా ఈ కొత్త నిర్ణయం మెడికల్ కలలు కంటున్న లక్షలాది మంది మ్యాథ్స్ విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చేలా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »