భగీరథ్‌ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు..! మరో సెక్షన్‌ జోడించిన పోలీసులు..!

పోక్సో కేసు (POCSO Case)లో నిందితుడు బండి భగీరథ్‌ (Bandi Bhageerath) కీలక డిజిటల్ సాక్ష్యాలను (Digital Evidence) ధ్వంసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐఫోన్‌ (iPhone) డేటా డిలీట్‌, సోషల్ మీడియా అకౌంట్ల మాయం నేపథ్యంలో కేసులో బీఎన్ఎస్‌ సెక్షన్‌ 238 (BNS Section 238)ను అదనంగా జత చేసి ఫోరెన్సిక్‌ దర్యాప్తు (Forensic Investigation) వేగవంతం చేశారు.

Bandi Sai Bageerath Bail: ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలపై కొత్త చర్చ
Bandi Sai Bageerath Bail: ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలపై కొత్త చర్చ

Pocso Case | దేశవ్యాప్తంగా కలకలం రేపిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ కీలక ఆధారాలను చెరిపివేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ నెల 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన వెంటనే అతడు ఫోన్ స్విచ్చాఫ్ చేసి కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న సమయంలో తన వద్ద ఉన్న అత్యాధునిక ఐఫోన్‌లోని డేటా, ముఖ్యమైన వీడియోలు, చాటింగ్ వివరాలు తొలగించడమే కాకుండా సోషల్ మీడియా ఖాతాలను కూడా డీయాక్టివేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అరెస్ట్ తర్వాత పోలీసులు ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో సిమ్ కార్డు లేకపోవడం, మొత్తం డేటా ఖాళీగా కనిపించడం అనుమానాలకు తావిచ్చింది. దీంతో సాక్ష్యాలను నాశనం చేసినట్టుగా భావించిన అధికారులు కేసులో బీఎన్ఎస్ సెక్షన్ 238ను కూడా చేర్చారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ఫోన్‌ను పలుమార్లు ఫార్మాట్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, ఆధారాలు మాయం చేయాలని ప్రయత్నించినా, వాటిని తిరిగి రాబట్టేందుకు మరింత ఆధునిక సాంకేతికతతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

Read Also : బండి భగీరథ్‌ పోక్సో కేసు.. సంచలన లేఖ విడుదల చేసిన బాధితురాలి తల్లి..!

కదలికలపై ఆరా..

ఐఫోన్‌లలో ఉన్న కఠినమైన సెక్యూరిటీ వ్యవస్థల కారణంగా డేటా రికవరీ సవాల్‌గా మారినా, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిపుణులు ‘సెలెబ్రైట్’ వంటి అత్యాధునిక సాఫ్ట్‌వేర్ సాయంతో డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలు, చాటింగ్ వివరాలను తిరిగి పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకవేళ ఫోన్‌ను పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేసి ఉంటే, ఐక్లౌడ్ బ్యాకప్ ద్వారా సమాచారాన్ని సేకరించే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. అవసరమైతే కోర్టు అనుమతితో యాపిల్ సంస్థను సంప్రదించేందుకు సైతం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిందితుడు ఫోన్ స్విచ్చాఫ్ చేసే ముందు ఎక్కడ ఉన్నాడు ? ఎవరితో మాట్లాడాడు ? పరారీలో ఉండగా సహకరించిన వారు ఎవరు? అనే అంశాలపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్ లొకేషన్‌లు, కాల్ డేటా రికార్డులు, డిజిటల్ ట్రైల్ ఆధారంగా భగీరథ్‌ కదలికలను విశ్లేషిస్తున్నారు. సాంకేతిక ఆధారాల సేకరణలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా కేసు బలహీనపడకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. కేసులో భాగంగా బాధితురాలి మొబైల్ ఫోన్‌ను కీలక సాక్ష్యంగా వినియోగించనున్నారు. నిందితుడు పంపిన బెదిరింపు సందేశాలు, ఫొటోలు, వీడియోలు వంటి వివరాలను ‘రిసీవ్డ్ డేటా’ రూపంలో సేకరించి ఫోరెన్సిక్ ధ్రువీకరణ అనంతరం కోర్టులో సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోక్సో కేసులో ఆధారాలను తారుమారు చేయడం, ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం నేర తీవ్రతను మరింత పెంచాయని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also : మ‌రోసారి పెట్రో మోత‌.. ఆందోళ‌న‌కు గుర‌వుతున్న వాహ‌న‌దారులు..!

అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్‌పై వెనక్కి..

పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో బండి సాయిభగీరథ్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికే నిందితుడు అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు ప్రాధాన్యం లేకుండా పోయిందని ఆయన తరఫు న్యాయవాది హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ ద్వారా తెలిపారు. పిటిషన్‌పై ఇక ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదని పేర్కొంటూ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన ఈ కేసులో భగీరథ్‌ ముందస్తు బెయిల్‌ కోరగా, జస్టిస్‌ టీ మాధవీదేవి విచారణ చేపట్టారు. అయితే, బాధిత బాలిక వాంగ్మూలంలో ఉన్న ఆరోపణల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. అనంతరం గత శనివారం భగీరథ్‌ పోలీసులకు లొంగిపోగా, పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు.

Read Also : బండి సంజ‌య్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసు జారీ చేయాలి.. క‌విత డిమాండ్‌

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »