Petrol-Diesel Price Hike | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మంగళవారం లీటరుకు సుమారు 90 పైసల వరకు ధరలను పెంచాయి. వారం రోజుల్లో రెండోసారి ధరలను పెంచడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గత శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెంచిన విషయం తెలిసిందే. తాజాగా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్‌పై 87 పైసలు పెరిగి లీటరు రూ.98.64కు చేరగా, డీజిల్‌పై 91 పైసలు పెరిగి రూ.91.58కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల విషయానికి వస్తే.. ముంబయిలో పెట్రోల్ ధర 91 పైసలు పెరిగి లీటరు రూ.107.59కు చేరుకుంది. డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ.94.08కి ఎగబాకింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసలు పెరిగి రూ.109.70కు చేరగా, డీజిల్ 94 పైసలు పెరిగి రూ.96.07కి పెరిగింది. చెన్నైలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ.104.49, డీజిల్ ధర 86 పైసలు పెరిగి లీటరు రూ.96.11కి చేరింది. ఇక హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.111.84, డీజిల్ రూ.99.95కి పెరిగింది.
Read Also : రైలులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ప్రయాణికురాలు: విజయవాడ రైల్వే సిబ్బంది మానవత్వం.. భేష్!
ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలే ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. పశ్చిమ ఆసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ముంచుకొస్తున్నది. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుండడంతో ముడి చమురు సరఫరాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో బ్రెంట్ క్రూడ్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య దీర్ఘకాల కాల్పుల విరమణపై చర్చలు కొనసాగుతున్నాయి.
Read Also : పిఠాపురం రైల్వే స్టేషన్‌కు మహర్దశ: పవన్ కళ్యాణ్ కృషితో రూ. 37.25 కోట్లు మంజూరు.. అమృత్ భారత్ పథకంలోకి చేరిక!
చమురు కంపెనీలకు కొంత ఊరట
లీటరుకు రూ.3 పెంపుతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు కొంత ఉపశమనం లభించినట్లు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. చమురు సంస్థలకు వస్తున్న రోజువారీ నష్టాలు సుమారు 25శాతం తగ్గి రూ.750 కోట్లకు చేరాయి. అంతకు ముందు నష్టం రోజుకు రూ.వెయ్యికోట్లుగా ఉండేదని తెలిపారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగినా, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు మే 15 వరకు పాత ధరలకే పెట్రోల్, డీజిల్‌ను విక్రయించాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయిల్ కంపెనీల నష్టాలను భర్తీ చేసేందుకు ఎలాంటి సబ్సిడీ, ప్రత్యేక ప్యాకేజీపై ప్రభుత్వం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు.
Read Also : టీటీడీ అన్నదాన పథకానికి 40 ఏళ్లు: ఎన్టీఆర్ సంకల్పం.. లక్కిశెట్టి వెంకటరామయ్య త్యాగం! తెరపైకి ఆసక్తికర చర్చ


