Saraswati Pushkaralu | కాళేశ్వరం పుణ్యక్షేత్రం మరోసారి ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. సరస్వతీ నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. గురువారం ప్రారంభమయ్యే ఈ పుష్కరాలు జూన్ 1 వరకు కొనసాగనున్నాయి. ఇప్పటికే కాళేశ్వరంలో భక్తుల రాకపోకలు పెరుగుతుండగా, ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దుతున్నారు. గురువారం ఉదయం 5.43 గంటలకు అంత్య పుష్కర ముహూర్తంగా పండితులు నిర్ణయించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు పుష్కరాలను ప్రారంభించనున్నారు. తొలి రోజు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కాళేశ్వరానికి చేరుకుని పుష్కర స్నానం ఆచరించనున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. సాయంత్రం సరస్వతీ ఘాట్ వద్ద నిర్వహించే నవరత్న హారతులు, తెప్పోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు..
గతేడాది జరిగిన పుష్కరాల తరహాలోనే ఈసారి కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తూ అధికారులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ప్రముఖులు వచ్చే అవకాశముండడంతో గోదావరి తీరంలో ప్రత్యేక హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. సరస్వతీ ఘాట్ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. రాత్రివేళల్లో రంగురంగుల లైటింగ్‌తో కాళేశ్వరం కొత్త అందాన్ని సంతరించుకుంది. ఘాట్ వద్ద భారీ సెట్టింగులు, అలంకరణలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, వైద్య శిబిరాలు, మొబైల్ టాయిలెట్లు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. పుష్కరాల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి 3,360 ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సర్వీసులు కూడా సిద్ధంగా ఉంచారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నారు. దాదాపు 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
హారతులు, తెప్పోత్సవం ప్రత్యేక ఆకర్షణ
సరస్వతీ ఘాట్ వద్ద ప్రతిరోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాశీ నుంచి వచ్చే పండితులు నవరత్న హారతులు ఇవ్వనుండగా, భక్తులు వీక్షించేందుకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. కాకినాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పడవతో ప్రతిరోజూ తెప్పోత్సవం నిర్వహించనున్నారు. పుష్కరాలు ముగిసే వరకు నిత్యం హోమాలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. చివరి రోజు రుద్రయాగం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం సమీపంలో రూ.1.20 కోట్ల వ్యయంతో నిర్మించిన మ్యూజియం భవనాన్ని సైతం గురువారం ప్రారంభించనున్నారు. కాళేశ్వరం క్షేత్ర చరిత్ర, పురాతన శిల్పాలు, ఆధ్యాత్మిక విశేషాలను ఇందులో ప్రదర్శించనున్నారు. భక్తులకు క్షేత్ర ప్రాముఖ్యతను తెలియజేసేలా ప్రత్యేక గ్యాలరీలను రూపొందించారు.

సరస్వతీ నది విశిష్టత..
భారతీయ సంస్కృతిలో సరస్వతీ నదికి ప్రత్యేక స్థానం ఉంది. పురాణాల ప్రకారం గంగా, యమునలతో పాటు సరస్వతీ కూడా పవిత్ర నదిగా భావిస్తారు. ప్రస్తుతం ఈ నది ఇప్పటికీ భూగర్భంలో ప్రవహిస్తోందని విశ్వాసం. అందుకే ‘అంతర్వాహిని సరస్వతి’ అని పిలుస్తారు. విద్య, జ్ఞానానికి ప్రతీకగా సరస్వతీ దేవిని ఆరాధిస్తారు. పుష్కరాల సమయంలో ఈ నదిలో స్నానం చేస్తే పుణ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. కాళేశ్వరం ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమం ఉండడం ఈ క్షేత్రానికి ప్రత్యేకంగా ఆధ్యాత్మిక గుర్తింపును తీసుకువచ్చింది.
Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. నిజామాబాద్‌లో అత్యధికంగా 45.7 డిగ్రీలు..
ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ.. భూముల విలువ పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్..!


