TG Cabinet | తెలంగాణ మంత్రివర్గం సమావేశం ఈ నెల 21న జరుగనున్నది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఇది 33వ మంత్రివర్గ సమావేశం కావడం విశేషం. ఈ సమావేశానికి సంబంధించిన అంశాల జాబితాను ముందస్తుగా ఆమోదించి, సాధారణ పరిపాలన శాఖ (కేబినెట్)కు సమర్పించాలని అన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులకు సూచించారు. అలాగే, అన్ని ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశారు. ఏజెండా అంశాలు లేకపోతే ‘నిల్ రిపోర్ట్’ అయినా సమయానికి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేబినెట్ సమావేశం రోజున ఉన్నతాధికారులంతా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమావేశం సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని విభాగాల సమన్వయంతో పని చేయాలని సూచించారు.
Read Also : థ్యాంక్స్ సీఎం రేవంత్..! సీఎం రేవంత్ చిత్రపటానికి 2008 డీఎస్సీ టీచర్స్ పాలాభిషేకం..!
కేబినెట్ భేటీలో ప్రధానంగా భూముల మార్కెట్ విలువను సవరించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణం, రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ అంశాలపై కూడా చర్చ జరగనుందని చర్చ సాగుతోంది. అయితే, భూముల విలువల పెంపు అంశమే అజెండాలో ప్రధాన అంశంగా తెలుస్తోంది. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించే ప్రతిపాదన ఇప్పటికే దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. ప్రాంతాల వారీగా పెంపు ఎంత మేర ఉండాలన్నదానిపై సంబంధిత శాఖలు విస్తృతంగా అధ్యయనం చేసి నివేదికలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, గరిష్టంగా వందశాతం మించకుండా పెంపు ఉండేలా సీలింగ్ విధించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కనిష్ఠంగా 5 శాతం నుంచి గరిష్టంగా వందశాతం వరకు భూముల మార్కెట్ విలువలను పెంచే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా వచ్చే ఆదాయంలో గణనీయమైన పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 28 నుంచి కొత్త మార్కెట్ విలువల ఆధారంగా స్టాంప్ డ్యూటీ వసూలు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం. ప్రభుత్వం ఈ సవరణల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల వరకు ఆదాయం పొందవచ్చని అంచనా. భూముల విలువల సవరణతో పాటు రియల్ ఎస్టేట్ రంగంపై దీని ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపై కేబినెట్‌లో చర్చించే ఛాన్స్ ఉంది.
Read Also : రాయదుర్గం భూములు వేలం వేయనున్న కాంగ్రెస్ సర్కారు..! ఒక్కో ఎకరానికి రూ.139 కోట్లు..!
ప్రతిపాదిత మార్పుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో ఎకరా కనిష్ట విలువ రూ.2.75 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఈ విలువ రూ.5 లక్షల వరకు ఉండనుందని సమాచారం. ఓఆర్‌ఆర్ లోపల ఎకరా భూమి విలువ కనిష్టంగా రూ.15లక్షల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న హెచ్‌ఎండీఏ పరిధిలో రూ.10 లక్షల వరకు ధరలు నిర్ణయించే ప్రతిపాదనలున్నట్లు తెలుస్తోంది. చదరపు గజం ధరల విషయానికొస్తే ఓఆర్‌ఆర్ లోపల రూ.3500 నుంచి రూ.4000 వరకు, ఓఆర్‌ఆర్ పరిసర ప్రాంతాల్లో రూ.3000 నుంచి రూ.3500 వరకు ఉండేలా ప్రతిపాదనలు రూపొందించినట్లు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్లలో గజం కనిష్ఠ ధర రూ.2500 నుంచి రూ.3000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2000 వరకు నిర్ణయించే అవకాశం ఉంది. ఓపెన్ ప్లాట్ల విషయంలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 15 నుంచి 20 శాతం ప్లాట్లకు వంద శాతం వరకు ధరలు పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. అదే విధంగా ఓఆర్‌ఆర్ లోపల రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సగం వరకు ప్లాట్ల విలువను రెట్టింపు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నిర్ణయాలపై కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశాలు ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో భారీ మార్పులు జరుగనున్నాయి.
Read Also : అనుకున్న సమయానికి నైరుతి ఆగమనం.. 25 నుంచి 27 మధ్య కేరళను తాకే ఛాన్స్..!


