Monsoon | రెండురోజుల్లో తెలంగాణకు నైరుతి.. రైతాంగానికి తీపికబురు చెప్పిన ఐఎండీ..!
Monsoon | భానుడి భగభగలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని, జూన్ 10 నుంచి 12 తేదీల మధ్య తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా చేశారు. రుతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించి, ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈసారి నైరుతి ఆలస్యంగా రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ ఒకటినే రుతుపవనాలు ప్రవేశిస్తాయి. ఈ ఏడాది స్వల్పంగా ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం వేగంగా ముందుకు సాగుతున్నాయి. కేరళ నుంచి కర్నాటక, కొంకణ్ ప్రాంతాల మీదుగా విస్తరిస్తున్న రుతుపవనాలు త్వరలో తెలంగాణలోకి అడుగుపెట్టనున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈశాన్య అరేబియా సముద్రం, ఉత్తర బంగాళాఖాతంలో రెండు వేర్వేరు తుపాను ఆవర్తనాలు ఏర్పడడడం రుతుపవనాల విస్తరణకు దోహదపడనుంది. అరేబియా సముద్రం నుంచి పెద్ద ఎత్తున తేమతో కూడిన గాలులు భూభాగం వైపు కదులుతుండగా, బంగాళాఖాతంలోని ఆవర్తనం కూడా వర్ష మేఘాల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను నెలకొంటున్నాయి. ఈ రెండు వాతావరణ వ్యవస్థల ప్రభావంతో మధ్య భారతదేశం మీదుగా మేఘాలు దట్టంగా ఏర్పడుతున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. జూన్ 11 నాటికి ఈ వాతావరణ పరిస్థితులు మరింత బలపడే అవకాశం ఉంది. ఫలితంగా తెలంగాణలోని చాలా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా, రుతుపవనాలు పూర్తిస్థాయిలో ప్రవేశించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. దీంతో సాగునీటి వనరులు మెరుగుపడటంతో పాటు భూగర్భ జలాల మట్టాలు కూడా పెరిగే అవకాశముంది.
ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌కు సిద్ధమవుతున్న రైతులకు ఈ పరిణామం ఊరటనివ్వనుంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు విత్తనాలు, ఎరువుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రుతుపవనాలు సకాలంలో రావడం వల్ల వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. అయితే, ఈ ఏడాది వర్షాకాలంపై ‘ఎల్ నినో’ ప్రభావం కొంత మేర కనిపించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున నీటి వినియోగంలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. రైతులు కూడా వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ పంటల ప్రణాళికలు రూపొందించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మొత్తానికి మరో రెండు మూడు రోజుల్లో తెలంగాణలో వర్షాకాలం అధికారికంగా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో ప్రజలు, రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వచ్చే వారం రోజుల్లో దక్షిణ రాష్ట్రాలతో పాటు ఈశాన్య భారతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర తీర ప్రాంతం, ఇంటీరియర్ కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలలో వరద ముప్పు పొంచి ఉంది. ఇక ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలలో జూన్ 12 వరకు కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది. తీవ్ర వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, నగరాల్లో ట్రాఫిక్ అంతరాయం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పింది. దక్షిణ, తూర్పు ప్రాంతాలు వర్షాలతో చల్ల బడుతుంటే, వాయువ్య, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు ఎండలు మండుతూనే ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, రాజస్థాన్, ఒడిశాలలో వచ్చే వారం రోజులు తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.


