తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్, అప్రమత్తమైన హైడ్రా

తెలంగాణలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో హైడ్రా బృందాలు రంగంలోకి దిగి 26 చెట్లు తొలగించగా, పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ కొనసాగుతోంది.

Telangana Heavy Rains
తెలంగాణలో భారీ వర్షాలు.

హైదరాబాద్, జూన్ 13: తెలంగాణలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కొనసాగగా, వనపర్తి, గద్వాల జిల్లాలకు కూడా వర్షాలు విస్తరించాయి.

వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో రాత్రి పొడవునా వర్షాలు కురిశాయి. జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్, సిద్ధిపేట, మేడ్చల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.

హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం

శనివారం ఉదయం 6:45 గంటల సమయానికి హైదరాబాద్ నగరంలో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. పశ్చిమ, దక్షిణ హైదరాబాద్ ప్రాంతాలైన నార్సింగి, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, టెల్లాపూర్, మణికొండ, షేక్‌పేట్, టోలిచౌకి, రాజేంద్రనగర్, శంషాబాద్, బండ్లగూడ జాగీర్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో తెల్లవారుజామున మోస్తరు వర్షాలు కురిశాయి.

రంగంలోకి దిగిన హైడ్రా బృందాలు

శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హైడ్రా (HYDRAA) డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అర్ధరాత్రి వరకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 26 చెట్లు నేలకొరిగినట్లు ఫిర్యాదులు అందగా, వాటిలో 21 చెట్లను తక్షణమే తొలగించారు.

మెహిదీపట్నం, అత్తాపూర్ ప్రాంతాల్లో ఏర్పడిన వాటర్ లాగింగ్ సమస్యలను సిబ్బంది వెంటనే పరిష్కరించారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-1లోని జలగం వెంగళరావు పార్క్ సమీపంలో నేలకొరిగిన చెట్లను తొలగించి నిమ్స్ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు.

వరద ముప్పు తగ్గించిన ముందస్తు చర్యలు

మంగళవారం భారీ వర్షాల సమయంలో నీటమునిగిన కొండాపూర్, మియాపూర్, రాయదుర్గం మెట్రో స్టేషన్, గచ్చిబౌలి బయోడైవర్సిటీ ప్రాంతాల్లో హైడ్రా సిబ్బంది గత కొన్ని రోజులుగా పూడిక తొలగింపు పనులు చేపట్టారు. దీంతో శుక్రవారం భారీ వర్షం కురిసినా ఈ ప్రాంతాల్లో పెద్దగా నీరు నిల్వ కాలేదు.

ఖాజాగూడ చెరువులోకి వరద నీరు సులభంగా చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వరద కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం వల్ల గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలకు సూచనలు

వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలు అవసరం లేని ప్రయాణాలు తగ్గించాలని సూచించారు. భారీ వర్షాల సమయంలో నీరు నిలిచే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »