తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మున్సిపాలిటీల్లో మొత్తం 2,582 వార్డులు ఉండగా, అందులో 12 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటర్ల సౌకర్యార్థం 6,017 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ వార్డుల్లో మొత్తం 10,719 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. (చదవండి: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. 10 మందికి కొత్త బాధ్యతలు, సింగరేణికి కొత్త సీఎండీ నియామకం)
కార్పొరేషన్ వార్డుల్లో 2,225 మంది అభ్యర్థులు..
ఇక మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికి వస్తే, మొత్తం 414 వార్డులలో 2 వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయి. మిగిలిన 412 వార్డుల్లో నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,174 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ వార్డుల్లో 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 52,17,413 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 25,49,750 మంది, మహిళలు 26,67,025 మంది, ఇతరులు 638 మంది ఉన్నారు.
ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 13న ఉదయం 8 గంటలకు ప్రారంభమై ఫలితాలు ప్రకటించనున్నారు. అనంతరం 16న చైర్‌పర్సన్లు, వైస్ చైర్‌పర్సన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహించనున్నారు.
భారీ స్థాయిలో సిబ్బంది, వెబ్‌కాస్టింగ్ పర్యవేక్షణ
ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పటిష్ట చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించిన వివరాల ప్రకారం, ఎన్నికల కోసం 1,379 మంది రిటర్నింగ్ అధికారులు, 41,773 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి మంగళవారం సాయంత్రానికే పోలింగ్ సిబ్బంది ఎన్నికల సామగ్రితో పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు చేరుకున్నారు. (చదవండి: ఇక నుండి సిగ్నల్ జంప్ చేస్తే కఠిన చర్యలు… హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్)
అదేవిధంగా పారదర్శకత కోసం 8,191 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఓటింగ్ ప్రక్రియలో ఉపయోగించేందుకు 16,382 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతో పాటు అదనపు బ్యాలెట్ బాక్సులను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కొనసాగుతున్నాయి. ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.