తెలంగాణలో రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కావడంతో రాజకీయంగా ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీలో సంఖ్యాబలం దృష్ట్యా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ రెండు స్థానాలను సులభంగా కైవసం చేసుకుంటామని భావిస్తోంది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం గెలుపోటములతో సంబంధం లేకుండా వ్యూహాత్మకంగా పోటీకి దిగే అవకాశముందన్న చర్చ జరుగుతోంది.
గెలుపు లెక్కలు ఇలా…
119 మంది సభ్యులున్న తెలంగాణ అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికల కోసం ఒక్కో అభ్యర్థికి సుమారు 40 ఓట్లు అవసరం. ఒకవేళ బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉంటే, కోటా 38 ఓట్లకు తగ్గే అవకాశం ఉంది. అప్పుడు రెండు స్థానాలకు కలిపి 76 ఓట్లు సరిపోతాయి.
ప్రస్తుతం కాంగ్రెస్‌కు 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సీపీఐ సభ్యునితో కలిపితే 67 మంది అవుతారు. ఎంఐఎం (7 మంది) మద్దతు లభిస్తే సంఖ్య 74కు చేరుతుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను కలుపుకుంటే బలం 76 దాటుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో రెండు స్థానాలు కూడా తమవేనని హస్తం పార్టీ ధీమాగా ఉంది.
బీఆర్ఎస్ వ్యూహం ఏమిటి?
రికార్డుల ప్రకారం బీఆర్ఎస్ బలం 37గా ఉన్నప్పటికీ, అందులో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుత బలం 28కు పడిపోయింది. ఈ నేపథ్యంలో గెలుపు అవకాశాలు తక్కువైనా పోటీకి దిగాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నట్టు సమాచారం.
పార్టీ అధినేత చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అలా చేస్తే ఎంఐఎం మద్దతు కోరే అవకాశం ఉంటుంది. ఎంఐఎం మద్దతు ఇస్తే రాజకీయ సమీకరణాలు మారే అవకాశముండగా, మద్దతు ఇవ్వకపోతే వారి వైఖరిని ప్రశ్నించే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
విప్, క్రాస్ ఓటింగ్ కీలకం
రాజ్యసభ ఎన్నికల్లో పార్టీలు విప్ జారీ చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు తమ ఓటును పార్టీ ప్రతినిధికి చూపాల్సి ఉంటుంది. అలా చేయకపోతే ఓటు చెల్లదనే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల ఓట్లు కీలకంగా మారే అవకాశం ఉంది. వారిని ఇబ్బందిలో పెట్టేలా వ్యూహం రచిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
రాజకీయ సందేశమే లక్ష్యమా?
గెలుపు కష్టమేనన్న లెక్కలున్నా, రాజకీయంగా సందేశం ఇవ్వడమే బీఆర్ఎస్ అసలు లక్ష్యమా అన్న చర్చ సాగుతోంది. మైనార్టీ అభ్యర్థి ద్వారా ఎంఐఎం వైఖరిని బయటపెట్టడం, జంపింగ్ ఎమ్మెల్యేల స్థితిని స్పష్టంచేయడం వంటి అంశాలపై గులాబీ పార్టీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
మొత్తంగా తెలంగాణ రాజ్యసభ రేసు ఆసక్తికర మలుపులు తిరిగే అవకాశముంది. కాంగ్రెస్ సంఖ్యాబలం మీద ధీమాగా ఉండగా, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పోటీకి దిగితే రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాల్సి ఉంది.