Bus Catch Fire | వరుస బస్ ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలకు గురవుతుండడంతో భయాందోళనలు నెలకొంటున్నాయి. ప్రకాశం జిల్లా రాజుపాలెం సమీపంలో హైదరాబాద్–తిరుపతి మార్గంలో వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంజిన్ భాగంలో నుంచి పొగలు, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కకు నిలిపివేశారు. సంఘటన సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించకముందే అందరూ సురక్షితంగా కిందకు దిగడంతో భారీ ప్రమాదం తప్పింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు భయంతో కుదేలయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Read Also :దక్షిణ కోస్తా రైల్వే జోన్… 12 ఏళ్ల నిరీక్షణకు ముగింపు దగ్గరేనా?
వరుస ఘటనలు..
ఈ ఘటన ఒక్కటే కాదు.. గత కొంతకాలంగా రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటుండటం గమనార్హం. రహదారి భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ ఏడాది పల్నాడులో ఆర్టీసీ బస్సు టైర్ పంచర్ అయి కాలువలోకి దూసుకెళ్లింది. కానీ, డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. గతేడాది కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురై మంటలు అంటుకోవడంతో 20 మంది సజీవదహనమయ్యారు. అంతకు ముందు ప్రకాశం జిల్లాలోనే మార్కాపురం ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వెళ్తున్న ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో మంటలు చెలరేగి 13 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
Read Also : 2027 గోదావరి పుష్కరాలకు అన్నీ రెడీ — 10 కోట్ల భక్తులు, 373 స్నాన ఘాట్లు, ₹60 కోట్ల బడ్జెట్!
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. గతేడాది సైతం తూర్పుగోదావరి జిల్లాలోనూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన వాహనం బస్సును ఢీకొట్టడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ వరుస ప్రమాదాలు రోడ్డు భద్రతా ప్రమాణాలు, ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల నిర్వహణపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. వాహనాల ఫిట్‌నెస్, డ్రైవర్ల నిర్లక్ష్యంతో వల్లే ప్రమాదాలు జరుగున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం అధికారులు రోడ్డు భద్రతా నియమాలను మరింత కఠినంగా అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
Read Also : ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం అమలు – ప్రతి విద్యార్థికి రూ.15,000, కొత్త మార్గదర్శకాలు జారీ


