Foreign Education Scheme | విదేశాల్లో ఉన్నత విద్య చదవాలన్న కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విదేశీ విద్యకు దూరమవుతున్న వారికి ఊరటనిచ్చేలా ఏపీలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘విదేశీ విద్యా పథకం’ను తిరిగి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ పథకం అమల్లోకి వస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గతంలో కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన ఈ అవకాశాన్ని ఇప్పుడు మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. ఎస్సీ విద్యార్థులతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఇతర వర్గాల ప్రతిభావంతులకూ ఈ పథకం వర్తించేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వ కాలంలో విదేశీ విద్యా పథకం అమలులో పలు సమస్యలు తలెత్తాయని, అర్హులైన అనేక మంది విద్యార్థులు లబ్ధి పొందలేకపోయారని మంత్రి పేర్కొన్నారు. ఆ లోపాలను సరిదిద్ది, పారదర్శక విధానంతో ఎంపిక ప్రక్రియ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిభ, ఆర్థిక పరిస్థితి, విద్యా అర్హతలను పరిగణనలోకి తీసుకుని విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. గతంలో అమలులో ఉన్న ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి’ తరహాలోనే ఈ పథకాన్ని పునరుద్ధరించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. విదేశాల్లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు సహా వ్యక్తిగత ఖర్చులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించే విధంగా పథకాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. దాంతో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే మధ్యతరగతి, పేద కుటుంబాల విద్యార్థులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉందన్నారు.
ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ చేపట్టనున్న ఇతర కార్యక్రమాల గురించి కూడా మంత్రి వివరించారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ కాలనీల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా సిమెంట్ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల, తాగునీటి సౌకర్యాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని 989 హాస్టళ్లలో అత్యాధునిక ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే కొత్త వృద్ధాశ్రమాల నిర్మాణం, సామాజిక సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల మెరుగుదల వంటి పనులను కూడా వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. అదనంగా, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ఎస్సీ అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో నిలిచిపోయిన పలు సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విదేశీ విద్యా పథకానికి సంబంధించిన అర్హతలు, ఆర్థిక సహాయం పరిమితి, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రమాణాలు వంటి పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రకటనతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఆశపడుతున్న వేలాది మంది విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి.


